హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 27: హైదరాబాద్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో మహా నగర వాసులు భయోందోళనలకు గురవుతుండగా గురువారం కూడా హైదరాబాద్ తో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్నిసార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. గురువారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పింది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 14 కిలోమీట్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవచ్చని చెప్పింది. విద్యుత్, నీటి సరఫరాలకు కూడా అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. పలుచోట్ల డ్రైనేజీ సమస్యలు తలెత్తవచ్చని పేర్కొంది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల్లో వెళ్లే వాహనచోదకులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.