హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 27: నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు తెరవడంతో మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మూసీని ఆనుకొని ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిషన్‌బాగ్ పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు, విపత్తు నిర్వహణ బృందలు, పోలీసులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హిమాయత్ సాగర్‌కు 1,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. జలాశయం నుంచి మూసీలోకి 1350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1761.45 అడుగులకు చేరింది. ఉస్మాన్ సాగర్‌కు 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1787.20 అడుగులుగా నమోదైంది. మూసీ ప్రాజెక్టు 7 గేట్ల ద్వారా నీటి విడుదల మరోవైపు, నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 17,250 క్యూసెక్కులు వస్తుండగా.. ప్రాజెక్టు నుంచి 17,250 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642.50 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.81 టీఎంసీలు ఉంది.