రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, జూలై 27: దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు నిర్మించేందుకు అమెరికన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు పీఎంవో మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య అణుశక్తి సహకారంపై 2008లో జరిగిన పరస్పర ప్రభుత్వ ఒప్పందానికి అనుగుణంగా మహారాష్ట్రలోని జైతాపూర్‌లో ఒక్కొక్కటి 1650 మెగావాట్ల సామర్ద్యంతో ఆరు అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఈడీఎఫ్ కంపెనీతో 2018లో వే ఫార్వర్డ్ అగ్రిమెంట్ జరిగిందని తెలిపారు. ఈడీఎఫ్ కంపెనీ సమర్పించిన టెక్నో కమర్షియల్ ఆఫర్‌పై ప్రస్తుతం విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రపోజల్ ఖరారై, ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం ప్రాజెక్టు షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి అన్నారు.
రాబోయేకాలంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి అణుశక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఒత్తిడి మొత్తం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి అత్యంత స్వచ్ఛమైన ఆశాజనకమైన శక్తిగా పరిగణింపబడుతోందని మంత్రి తెలిపారు. పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు స్థాపించేందుకు అనువుగా లేని ప్రదేశాల్లో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ కార్బన్ కాలుష్యంతో పెద్ద ఎత్తున విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. శిలాజ ఇంధన వినియోగానికి స్వస్తి పలికేందుకు కాలంచెల్లిన శిలాజ ఇంధన ఆధారిత పవర్ ప్లాంట్లుకు పునః ప్రయోజనం చేకూర్చేందుకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేసి నిర్వహించవచ్చని అన్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై విధానపరమైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు.