. తన ప్రసంగం డిలీట్ చేయడంతో ట్విటర్ ద్వారానే ఆహ్వానం
. ప్రధాని పర్యటనకు దూరంగా…
జైపుర్, న్యూస్ లీడర్, జూలై 27: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్‌లో పర్యటనకు వచ్చే ప్రధానిని తాను కేవలం ట్విటర్ ద్వారానే ఆహ్వానిస్తున్నానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వెల్లడిరచారు. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని రద్దు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని గహ్లోత్ స్వయంగా ట్వీట్ చేయడం గమనార్హం. ‘ఈ రోజు మీరు రాజస్థాన్‌కు వస్తున్నారు. కానీ, ప్రధాని కార్యాలయం నా మూడు నిమిషాల ప్రసంగాన్ని షెడ్యూల్ నుంచి తొలగించింది. అందువల్ల, నేను నా ప్రసంగంతో మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నా. అందుకే, ట్విటర్ వేదికగా మీకు సాదర స్వాగతం పలుకుతున్నా’ అని గహ్లోత్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ట్విటర్లోనే తమ డిమాండ్లను తెలియజేస్తున్నట్లు తెలిపారు. ‘నేను నా ప్రసంగంలో చెప్పాలనుకున్న డిమాండ్లను కూడా ట్విటర్ ద్వారానే మీ ముందుంచుతున్నా. ఆరు నెలల్లో ఏడోసారి రాష్ట్రానికి వస్తున్న మీరు.. ఈ సారైనా మా డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తున్నా’’ అంటూ గహ్లోత్ మోడీ సర్కారుకు కౌంటర్ ఇచ్చారు. రాజస్థాన్‌లోని సీకర్ పట్టణంలో ప్రధాని మోదీ గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ. 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. పర్యటనలో భాగంగా సీకర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఎందుకంటే….
ఇటీవల మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ రాజస్థాన్ ప్రస్తావన తీసుకురావడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై గహ్లోత్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని కార్యక్రమంలో ఆయన ప్రసంగాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
పీఎంవో స్పందన..
గహ్లోత్ ట్వీట్‌కు ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘‘ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాం. మీ ప్రసంగానికి సమయాన్ని కూడా కేటాయించాం. కానీ, మీరు ఈ కార్యక్రమానికి రాలేరని మీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. నేటి కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తున్నాం. అభివృద్ధి పనుల శిలాఫలకాలపైనా మీ పేరును ఉంచాం’’ అని పీఎంవో ట్విటర్లో పేర్కొంది.