కాలేయ వాపుతో పాటు కాలేయ సంబంధ వ్యాధులు, హెపాటోసెల్యులార్ కాన్సర్ లాంటి తీవ్ర ప్రాణాంతక వ్యాధులను ‘వైరల్ హెపటైటిస్’గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఒకరు చినిపోవడానికి కారణమైన కాలేయ వాపు లేదా హెరటైటిస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి 28 జూలై రోజున ‘ప్రపంచ హెపటైటిస్ దినం’ పాటించుట ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ హెపటైటిస్ దినం-2023 వేదికగా ‘ఒకే జీవితం ఒకే కాలేయం (వన్ లైఫ్ వన్ లివర్)’ అనబడే నినాదాన్ని ప్రచారం చేయటానికి నిర్ణయించారు. ప్రజారోగ్య ప్రమాదకర వ్యాధుల జాబితా నుంచి హెపటైటిస్‌ను 2030 నాటికి తప్పించడానికి ఐరాస పక్కా ప్రణాళికలు అమలు పరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 354 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక హెపటైటిస్ వ్యాధుల బారినపడ్డారు. ఏడాదికి 1.1 మిలియన్ల హెపటైటిస్ రోగుల మరణాలు నమోదు కాగా, 9.4 మిలియన్ల రోగులకు వైద్య చికిత్సలు జరుగుతున్నాయి.
హెపటైటిస్‌లో రకాలు:
హైపటైటిస్ వ్యాధికి ఐదు రకాల వైరస్ స్టేయిన్లు ఏ, బి, సి, డి మరియు ఈ ఉండగా, వీటిలో బి, సి హైపటైటిస్ వల్ల అధిక మరణాలు, కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. నవజాత శిశువులకు హైపటైటిస్ టీకాలు వేయించడం, సత్వరమే పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో చికిత్స తీసుకోవడం, తల్లులు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవడం లాంటి విషయాల్లో అలక్ష్యం వహిస్తే హెరటైటిస్ ప్రాణాలను కూడా తీసుకుంటుందని గమనించాలి.
ప్రపంచ హెపటైటిస్ దినం పూర్వాపరాలు:
1967లో ‘బరూచ్ బ్లుమ్బెర్గ్’ హెపటైటిస్‌ను కనుగొనడమే కాకుండా 1969లో హెపటైటిస్ – బి వ్యాధికి టీకాను కూడా రూపొందించడంతో వారి జన్మదినం 28 జూలై రోజున ప్రతి ఏట ప్రపంచ హెపటైటిస్ దినం నిర్వహించుట జరుగుతున్నది. 1976ల ఫిజియాలజీలో నోబెల్ బహుమతిని పొందిన బ్లూమ్‌బెర్గ్ సేవలు అత్యంత ప్రశంసనీయమైవనవి. టిబి, హెచ్ఐవి మరణాలు ఏటా తగ్గినప్పటికీ, హెపటైటిస్ కారణ మరణాలు క్రమంగా పెరగడం విచారకరం. 2015 నుంచి హెపటైటిస్-సి నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. హెపటైటిస్-బి వ్యాధితో ప్రతి ఏట 10,000 కేసులు, 23,000 మరణాలు జరుగుతున్నాయని, హెపటైటిస్-సి వల్ల 67,000 కేసులు, 84,000 మరణాలు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. హెపటైటిస్ సోకిన వారిలో 18 శాతం పరీక్షలు చేయించుకుంటున్నారని, వారిలో 3 శాతం మాత్రమే చికిత్సను పొందుతున్నారు. హెపటైటిస్-సి సోకిన వారిలో 22 శాతం పరీక్షలు చేయించుకోగా, 18 శాతం వైద్యం చేయించుకుంటున్నారు.
భారత్‌లో హెపటైటిస్:
భారతదేశంలో హెపటైటిస్ వ్యాధి ప్రమాదకర రోగాల జాబితాలో చేరింది. దేశంలో హెపటైటిస్-సి వ్యాధితో 40 మిలియన్లు బాధపడుతుండగా, వైరల్ హెపటైటిస్‌తో సాలీన 2.5 లక్షలు మరణిస్తున్నారు. లక్షల మందికి వైరల్ హెరటైటిస్ సోకినా పరీక్షలు చేయించుకోవడం లేదని, వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాంతకంగా మారుతున్నది. ప్రపంచ హెపటైటిస్-బి భారంలో ఇండియా 11 శాతం మోస్తుందడం ప్రమాదకరంగా మారుతున్నది. దేశ జనాభాలో హెపటైటిస్-బి వ్యాప్తి 3-4 శాతంగా అండవచ్చని అంచనా. హెపటైటిస్-సి వ్యాధి ఇండియాలో 8.7 మిలియన్ల ప్రజల్లో ప్రబలి ఉంది.
వ్యాధి లక్షణాలు:
హెపటైటిస్ సోకిన రోగుల్లో కండరాలు/కీళ్ళ నెప్పులు, తల నొప్పి, పసుపు రంగు కళ్ళు, అలసి పోవడం, పచ్చకామెర్లు, మానసిక ఒత్తిడి, అనారోగ్యం కలుగుతాయి. హెపటైటిస్-బి నిర్మూలనకు టీకాలు అందుబాటులో ఉండగా, 90 శాతం హెపటైటిస్-సి వ్యాధి చికిత్సతో నయం అవుతుంది. అపరిశుభ్ర ఆహారం, కలుషిత నీరు, చేపలు, వ్యాధిగ్రస్తుల సమీపాన మెదలడం, వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంబంధాల వల్ల హెపటైటిస్-ఏ సోకుతుంది. వ్యాధి నిరోధానికి టీకాలు వేయించడం, రోగులకు దూరంగా ఉండడం, స్వలింగ సంపర్కానికి దూరంగా ఉండడం, మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండడం, పరిశుభ్ర కుటుంబ వాతావరణం లాంటి జాగ్రత్తలతో హెపటైటిస్‌ను కొంత మేరకు నివారించవచ్చు.
హెపటైటిస్ లాంటి ఇతర ప్రాణాంతక వ్యాధుల పట్ల కొంత అలసత్వం వహించకుండా తరుచుగా మన కాలేయ ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ముందు జాగ్రత్తలు తీసుకుందాం. ఆరోగ్యమనే దీపం ఉండగానే కాలేయమనే ఇల్లును చక్కదిద్దుకుందాం. ప్రపంచ మానవాళి కరోనా లాంటి విపత్తులకు దూరంగా ఉంటూనే ఇతర ప్రమాదకర వ్యాధుల పట్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం.