` కొట్టుకుపోయిన రోడ్లు
` వాహనదారులకు తప్పని తిప్పలు
` పూడికతో నిండిపోయిన గెడ్డలు
` కోరింతకు గురైన తీరంలోని రహదారులు
న్యూస్‌లీడర్, విశాఖపట్నం కొన్ని రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దవుతోంది. ఎక్కడ చూసినా వరద బీభత్సం కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా ఉదయం సాధారణ వాతావరణం ఉండడం, సాయంత్రానికి కుంభవృష్టి కురుస్తుండడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపారుల నుంచి ఇళ్లకు చేరుకునే సమయంలో కావడంతో ఆయా వర్గాల ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కొని నానాయాతన పడుతున్నారు.
భారీ వర్షాల దెబ్బకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు పాడయ్యాయి. జ్ఞానాపురం, రామకృష్ణ జంక్షన్, కొబ్బరితోట, ఫిషింగ్ హార్బర్‌తో పాటు తీరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. వర్షం దెబ్బకు రోడ్లపై రాళ్లు తేలి రూపం మారిపోయాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో పలు చోట్ల మురుగు నీరు రహదారులపై పొంగిపొర్లుతోంది. కొన్ని చోట్ల గెడ్డలు, వాగుల్లో పూడిక చేరిపోవడంతో మురుగు నీరు ప్రవహించే అవకాశం లేక దుర్వాసన వెలువడుతున్నది.
రోడ్డు పాడవడంతో వర్షం కురిసిన గంటల తరబడి ముఖ్యకూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలు మొరాయించడంతో కష్టాలు తప్పడం లేదు. బీచ్‌రోడ్డులోని పలు పర్యాటక నిర్మాణాలు రాళ్లు తేలిపోవడంతో నిస్తేజంగా మారాయి.