ఆర్పీలకు అధికారుల టార్గెట్
ఒక్కొక్కరు రూ. 1210 చెల్లించాలంట
రూ. 5 కోట్ల వసూళ్ళకు మాస్టర్‌ప్లాన్
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 28 : జీవీఎంసీ అధికారులు పప్పుల వ్యాపారం ప్రారంభించారు. ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్షరాలా నిజం. అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశానుసారమేనట. దీని కోసం రెక్కాడితే గాని డొక్కాడని రిసోర్స్‌పర్సన్స్ (ఆర్పీ) లే పెట్టుబడి పెట్టాలట. ఒక్కో ఆర్పీ పన్నెండు వందల పది రూపాయలు ఈనెల 31వ తేదీలోగా తమ తమ సీవో (క్లస్టర్ అధికారి)లకు క్యాష్ రూపంలో చెల్లించాలట. అంతటితో సరిపోదు. ఆర్పీలు తమ ఆధీనంలో వుండే గ్రూపు సభ్యులందరి చేతా పన్నెండు వందల పది రూపాయల చొప్పున కట్టించాలట. తొలి విడతగా ఈనెలలో ఒక్కో ఆర్పీ కనీసం 35 మంది సభ్యుల చేతనయినా పన్నెండు వందల పది రూపాయలు వసూలు చేయాలంట. ఒక వేళ అలా కట్టించకలేకపోతే ఆర్పీల ఆధీనంలో వుండే స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సొమ్ము నుంచి తీసేసి అధికారుల చేతుల్లో తక్షణం పెట్టేయాలంట. ఇలా నగరంలోని వంద వార్డుల్లో వున్న దాదాపు వెయ్యి మంది ఆర్పీల నుంచి భారీ ఎత్తున సొమ్ములు గుంజడానికి జీవీఎంసీ పీడి సారధ్యంలో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఈనెల 31వ తేదీలోగా సుమారు 5 కోట్ల రూపాయలు ఆర్పీల ద్వారా గుంజేయడానికి స్కెచ్ రెడీ అయిపోయింది. గత పదిహేను రోజుల నుంచి జీవీఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం నుంచి ఈ పప్పుల వ్యాపారం గురించే ఆర్పీలకు మెసేజ్‌ల మీద మెసేజ్‌లు వెళ్తున్నాయి. అసలు ఈ పన్నెండు వందల పది రూపాయలూ మేము ఎందుకు కట్టాలి? అంటే సీఎం ఆఫీసు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. సొమ్ము కట్టి తీరాల్సిందేనంటూ సీఓల నుంచి ఆపై అధికారుల వరకూ ఒత్తిడి తెస్తూనే వున్నారు. ఇంతకీ ఈ పప్పుల వ్యాపారం ఏమిటా? అని ఆలోచిస్తున్నారు కదూ!చూడండి.. ‘జె.ఎం.ఆర్. బ్రాండ్ రైస్ అండ్ కిరాణా’ అంటూ ఒక కరపత్రాన్ని జీవీఎంసీ అధికారులు ఆర్పీలకు పంపించారు. పన్నెండు వందల పది రూపాయలు కట్టినందుకు గాను జె.ఎం.ఆర్. వాళ్ళు ఒక కార్డు ఇస్తారట. ఈ కార్డు ద్వారా జె.ఎం.ఆర్ నుంచి బియ్యం బస్తా కొంటే వంద రూపాయలు తగ్గిస్తారట. అయితే నెలకు ఒక బస్తా మాత్రమే కొనుక్కోవచ్చట. అలాగే కందిపప్పు మార్కెట్ ధర 145 రూపాయలు అయితే ఈ కార్డు వున్న వారికి వంద రూపాయలకే నెలకు 2 కేజీల చొప్పున యిస్తారట. మినపపప్పు మార్కెట్ ధర 160 రూపాయలు అయితే అది కూడా వంద రూపాయలకేనట. ఇక ప్రీడం ఆయిల్ మార్కెట్లో 145 రూపాయలు వుంటే అది కూడా వంద రూపాయలకే ఇస్తారట. పంచదార 48 రూపాయలు మార్కెట్ ధర అయితే వీళ్ళు కార్డు మీద పైగా 30 రూపాయలకే ఇస్తారట. దీని ద్వారా దాదాపు ఏడాదికి ఆరువేల రూపాయలు ఆదా చేసేయవచ్చట. కళ్ళు మూసుకొని రూ. 1210 కట్టేస్తారు, ఇవన్నీ ఎవరు చూస్తారు అనుకున్నరోఏమో? వీళ్ళు ప్రకటించిన పప్పుల ధరలు మార్కెట్ ధరలకన్నా ఎక్కువగానే వున్నాయి. ఇందులో ఈ జేఎంఆర్ బ్రాండ్ రైస్ అండ్ కిరాణా అడ్రసు ఎక్కడా లేదు. వీళ్ళ దుకాణాలు ఎక్కడున్నాయో వివరాలు లేవు. ఫోన్లోనే ఆర్డరు చేసుకోవాలట. వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా ఆర్డర్ చేస్తేనే ట్రాన్స్‌పోర్టు ఉచితమట. లేదంటే మరో పాతిక రూపాయలు వసూలు చేస్తారట. ఇదీ ఈ పప్పుల వ్యాపారం కథ.
అయితే వాడెవడో కంపెనీ పెట్టుకుంటే జీవీఎంసీ అధికారులు ఆ వ్యాపారాన్ని ఎందుకు తమ భుజాన వేసుకున్నారు? ఇదే ప్రశ్న ఆర్పీలు వారి వారి సీఓలను అడుగుతున్నారు. అమ్మో అడక్కండి`ఇది సీఎం గారి భార్య భారతి గారికి సంబంధించిన కంపెనీ. మనం సొమ్ము కట్టాల్సిందే నంటూ సీఓలు ఆర్పీలను భయపెట్టేస్తున్నారు. ‘ఇదేదో భోగస్ సార్… భారతి గారు ఇలాంటివి ఎందుకు చేస్తారు? సార్ అంటూ కొంత మంది ప్రశ్నిస్తే… అది కాదు.. సీఎం గారి ఆఫీసులో ధనుంజయరెడ్డి గారు వుంటారు కదా.. వారి నుంచి ఆదేశాలు వచ్చాయి.. అంటూ ఒక అధికారి ఆర్పీలకు చెబుతున్నారు. ఇంతకీ ఈ కంపెనీ ఎవరిదో తెలియక కార్పొరేటర్లు కూడా తలలు బాదుకుంటున్నారు. జీవీఎంసీ అధికారులు ఆర్పీలను బెదిరించి ఎడాపెడా కలెక్షన్లు చేసేస్తూ పార్టీ పరువు తీసేస్తున్నారని అనేక మంది వైసీపీ కార్పొరేటర్లు మధనపడిపోతున్నారు. దీనికి తోడు జె.ఎం.ఆర్ అంటే ఏమనుకున్నారు? జగన్ మోహన్ రెడ్డి అంటూ మరికొంతమంది సీఓలు ఆర్పీలను బెదిరిస్తున్నారు. సీఓలపై వారి పై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇదేమిటో అర్ధంగాక ఆర్పీలు విలవిల లాడిపోతున్నారు.
35 కార్డ్స్ కట్టు డ్రా పట్టు
‘‘ 35 మంది కార్డ్స్ కట్టు.. డ్రా పట్టు’’ ఇదీ జీఎంఆర్ బ్రాండ్ రైస్ అండ్ కిరాణా సీఇఓ మల్లేశ్వరరావు ఆర్పీలకు ఇచ్చిన బోనంజా, అయితే ఇక్కడ షరతులు కూడా వున్నాయి. మొత్తం జీవీఎంసీ పరిధిలో వున్న 900 మంది ఆర్పీలు ఖచ్చితంగా 35 కార్డుల చొప్పున చేయాలట. అలా చేస్తేనే ‘డ్రా’లో బహుమతులు పొందడానికి అర్హులట. అంటే ఆర్పీలు తాము చెల్లించిన సొమ్ము కాకుండా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఈనెల 31వ తేదీలోగా వసూలు చేసి ఇవ్వాలన్నమాట. 35 మందిని చేర్పించిన ఆర్పీలకు ఆగస్టు 1 మధ్యాహ్నం 12 గంటలకు డ్రా తీస్తారట. ఇందులో మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండవ బహుమతి రూ. 50వేలు, మూడవ బహుమతి రూ. 25 వేలు ఇస్తామని సీఇఓ పేరుతో వెలువడ్డ కరపత్రంలో తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై ఆర్పీలు గరంగరంగా వున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ని, జీవీఎంసీ మేయర్‌ని, కమిషనర్ని కలిసి ఫిర్యాదు చేయడానికి ఆర్పీలు సన్నద్ధం అవుతున్నారు. ఒక ప్రైవేటు వ్యాపారి మొత్తం జీవీఎంసీ వ్యవస్థను కబలించే పరిస్థితికి వచ్చిందంటే దీని వెనుక ఎవరు వున్నారు? ఇదీ తేలాల్సిన విషయం.