విజయవంతం చేయాలంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 28: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 900వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహిచనున్న ‘కార్మిక సమాహార సభ’ను జయప్రదం చేయాలంటూ నేతలు పిలుపునిచ్చారు. పోరాటాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను చేజార్చుకోబోమని, ప్రాణాల్ని త్యాగం చేసి తెచ్చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే సహంచబోమని ఇప్పటికే వివిధ మార్గాల్లో చేపట్టిన ఆందోళనల ద్వారా కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అఖిలపక్ష కార్మిక సంఘాలు, జేఏసీ, అమరావతి జేఏసీ, నిర్వాసిత సంఘాలు, ఏపీలోని 26జిల్లాల్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాల సహా అనేక మంది భాగస్వామ్యంతో ఫిబ్రవరి 12, 2021 నుంచి ఉద్యమాలు చేపడుతూ వస్తోంది. ఢల్లీిలోనూ కార్మిక సంఘాల నేతలు తమ గొంతు వినిపించారు. ఏపీలోని అధికార వైసీపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేయించారు. ఎంపీల సంతకాలు సేకిరంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే నష్టాల్ని దేశవ్యాప్తంగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న నిర్వాసిత కాలనీలు, కూర్మన్నపాలెం, ఉక్కునగరం ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు. 31న సాయంత్రం 4గంటలకు కూర్మన్నపాలెం శిబిరం వద్ద కార్మిక సమాహార సభ నిర్వహించనున్నారు. అన్ని వర్గాలూ ఈ సభను జయప్రదం చేయాలని నేతలు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.