న్యూఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 27: మణిపూర్ అంశం ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడంతో గురువారం ఉదయం లోక్‌సభ వాయిదా పడిరది. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యసభ కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడిరది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపూర్ హింసకు నిరసనగా ప్రతిపక్షాల కూటమికి చెందిన ఎంపీలు నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. మణిపూర్‌లో చోటుచేసుకుంటున్న అకృత్యాలను నిరసించేందుకు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉన్నామని తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించామని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడిరచారు. అలాగే మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించిరావడాన్ని భాజపా నేత పీయూష్ గోయల్ విమర్శించారు. ‘తీవ్రమైన విషయాలపై కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరం. అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న ప్రతిష్ఠను ఈ నల్లదుస్తులు ధరించిన వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారనుకుంటా. వారి గతం, వర్తమానం, భవిష్యత్తు అంధకారంలో ఉంది. కానీ, మేం వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆశిస్తున్నాం’ అని గోయల్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. భారత విదేశాంగ విధానాల్లో ఇటీవల పరిణామాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడిస్తున్న సమయంలో ఎన్డీఏ ఎంపీలు.. ‘మోడీ, మోడీ’ అని నినాదాలు చేయగా..అందుకు ప్రతిగా విపక్ష ఎంపీలు ‘ఇండియా, ఇండియా’ అని నినాదాలు చేశారు.
నలుపు రంగు దుస్తులతో ప్రయోజనమేమిటి : ప్రహ్లాద్ జోషీ
ప్రతిపక్ష ఇండియా సభ్యులు నలుపు రంగు దుస్తులను ధరించి పార్లమెంటుకు హాజరవడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కానీ, నలుపు రంగు దుస్తులు ధరించి, పార్లమెంటుకు హాజరవడం వల్ల కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ విశ్వసనీయతను ప్రజలు చూపిస్తారని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు భవిష్యత్తులో కూడా నలుపు రంగు దుస్తులు ధరించి సంచరించవలసి ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు.