చెన్నై, న్యూస్లీడర్, జూలై 25 : తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. కృష్ణగిరి ప్రాంతంలో బాణసంచా భద్రపర్చిన గోదాంలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గోదాం నివాస సముదాయాల మధ్యలో ఉంది. పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.