. నడిసంద్రం చిక్కుకున్న 36 మంది సురక్షితం . 30 గంటలు శ్రమించి ఒడ్డుకు లాక్కొచ్చిన నేవీ సిబ్బంది
చెన్నై, న్యూస్ లీడర్, జూలై 29: నడి సంద్రంలో మృత్యుకుహరంలో చిక్కుకున్న 36 మంది మత్స్యకారులను సురక్షితంగా కాపాడిన నేవీ సిబ్బంది సాహసకృత్యమిదీ. చేపలవేటకు వెళ్లి నడిసముద్రంలో రెండు రోజులపాటు చిక్కుకున్న ఈ మత్స్యకారులను భారత నౌకాదళ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఐఎన్ఎస్ ఖంజర్ సాయంతో 30 గంటలపాటు శ్రమించి మత్స్యకారుల పడవలను ఒడ్డుకు లాక్కొచ్చారు. తమిళనాడులోని నాగపట్టణం తీరం నుంచి 36 మంది మత్స్యకారులు మూడు పడవల్లో ఇటీవల చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతోపాటు ఇంధనం లేకపోవడం, ఇంజిన్ సమస్య తలెత్తడంతో వీరి పడవలు నిలిచిపోయాయి. అలా రెండు రోజులపాటు వారు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. మత్స్యకారుల చిక్కుకున్నట్లు సమాచారం రాగానే నౌకాదళం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఎన్ఐఎస్ ఖంజర్‌ను సహాయక చర్యలకు పంపింది. వీరు మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టగా తమిళనాడు తీరానికి దాదాపు 130 నాటికల్ మైళ్ల దూరంలో మూడు పడవలు కన్పించాయి. వెంటనే నౌకాదళ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ మూడు బోట్లకు తాళ్లు కట్టి 30 గంటలకుపైగా లాక్కుంటూ చెన్నై హార్బర్‌కు తీసుకొచ్చారు. మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మంధ్వాల్ వెల్లడిరచారు.