. గాయాలతో ఆసుపత్రిలో చేరిన మరో 20 మంది . శనివారం తెల్లవారుజామున ఘోరం
ముంబాయి, న్యూస్ లీడర్, జూలై 29: మహారాష్ట్రలో శనివారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకున్నారు.. తెల్లారితే క్షేమంగా ఇంటికి చేరుకుంటారనగా ఈ ఘోరం జరిగింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న బస్సు.. నాసిక్మ్ వైపుగా వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ముందు వెళుతున్న ట్రక్కును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మందిని బుల్దానా జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ 32 మంది ప్రయాణికులకు ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు. బుల్దానా జిల్లాలో ఈ నెలలో జరిగిన రెండో ఘోర ప్రమాదమిది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.