సిద్ధిపేట, న్యూస్ లీడర్, జూలై 29: అక్కడున్నవారు వద్దంటున్నా మొండిపట్టుదలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నం చేసిన ఓ కారు డ్రైవర్ కొట్టుకుపోయాడు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లి శివారులో గత రాత్రి జరిగిందీ ఘటన. అక్కెనపల్లి-బస్వాపూర్ మార్గంలో పెద్దవాగు భారీ వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దానిపైనున్న కాజ్వే నుంచి రెండు రోజులుగా రాకపోకలు నిలిపివేశారు. ఎవరూ ప్రయాణించకుండా కంపను అడ్డుగా పెట్టారు. అయినా సరే గత రాత్రి ఓ కారు అక్కెనపల్లి మార్గంలో వెళ్తూ కనిపించింది. అప్రమత్తమైన స్థానికులు కాజ్వే పైనుంచి వెళ్లొద్దని, వరద ఉద్ధృతంగా ఉందని డ్రైవర్ను వారించారు. వారి మాటలను పట్టించుకోని డ్రైవర్ మొండిగా ముందుకెళ్లాడు. అలా వెళ్లిన కారు వాగును దాటకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వాగు వద్దకు చేరుకున్న పోలీసులు చీకట్లో గాలించినప్పటికీ కారు ఆచూకీ కనిపించలేదు. ఆ ప్రాంతంలో చిమ్మచీకటిగా ఉండడంతో గాలింపు చర్యలు నిలిపేశారు. శనివారం నుంచీ మళ్లీ చేపట్టారు.