సత్తెనపల్లిలో విషాదం
సత్తెనపల్లి, న్యూస్ లీడర్, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సత్తెనపల్లి వాసులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సత్తెనపల్లికి చెందిన సినిమా థియేటర్ యజమాని షేక్ షుకూర్ (55)తోపాటు షేక్ బాషా (52), కొఠారు అంజయ్య కలిసి కారులో ఈనెల 22న గోవా ట్రిప్ వెళ్లారు. ట్రిప్ ముగించుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని కారు వేగంగా వెళ్ళి ఢీకొట్టింది. కారు లారీ కింద ఇరుక్కుపోగా లారీ డ్రైవర్ గమనించకుండా కొంత దూరంపాటు లారీ నడుపుకుంటూ వెళ్ళాడు. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ముందు సీటులో ఉన్ను షేక్ బాషా, వెనుక సీట్లో ఉన్న షేక్ షుకూర్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో ఉన్న కొఠారు అంజయ్యకు కాలు, చెయ్యి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ ప్రశాంత్ కుమార్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. షుకూర్కు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు ముగ్గురికీ వివాహాలయ్యాయి. షేక్ బాషాకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉండగా కుమార్తెకు వివాహమైంది. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. రెండు కుటుంబాల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. షేక్ షుకూర్ ఎంతో జాగ్రత్తపరుడు. ఆయనకు లిఫ్ట్, ఫ్లైట్ అంటే భయం. ఎన్ని మెట్లయినా ఎక్కేవారు. ఎంత దూరమైనా కారులోనే ప్రయాణించేవారు. చివరికి కారు ప్రయాణమే ఆయనను తిరిగిరాని లోకాలకు చేర్చింది. ప్రమాద విషయం తెలియగానే మరో సినిమా థియేటర్ యజమాని షేక్ సలాం, షుకూర్ కుమారులు కారులో ఘటనా స్థలానికి వెళ్లారు. గురువారం అర్ధరాత్రికి మృతదేహాలను సత్తెనపల్లికి తీసుకువచ్చారు.