అధికారుల్ని సస్పెండ్ చేయాలి
పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
మేయర్, కమిషనర్‌కు వినతినిచ్చిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 31: ‘జేఎంఆర్’ బ్రాండ్ పేరిట జీవీఎంసీ అధికారులు బియ్యం, కిరాణా సామగ్రి అమ్మించేందుకు ప్రయత్నించడం దారుణమని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పేరిట కూడా వ్యాపారం చేయించేందుకు పూనుకున్న వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, చర్యలు చేపట్టాలంటూ సోమవారం ‘స్పందన’లో భాగంగా మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మకు వేర్వేరుగా వినతిపత్రాలందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో ఉన్న 1030మంది ఆర్పీల ద్వారా రూ.1210చొప్పున 31,800 గ్రూపుల్లోని సభ్యుల వద్ద నుంచి సొమ్ములు వసూలు చేయాలన్నది అధికారుల ప్లాన్ అని మండిపడ్డారు. పేరూ ఊరు లేని వ్యాపారితో జీవీఎంసీ అదనపు కమిషనర్ వై.శ్రీనివాసరావు, యూసీడీ పీడీ పాపునాయుడు కుమ్మక్కై రూ.36.30కోట్లకు స్కెచ్ గీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన కార్డులు, రశీదులు కూడా వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేశాయన్నారు. ఈ నెల 31వ తేదీలోగా సొమ్ములు కట్టకపోతే ‘స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ఫండ్’ నుంచి డిపాజిట్లగా ఉన్న మొత్తాల్ని తీసుకుంటామని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. పైగా సీఎం కార్యాలయ ఆదేశాలంటూ జీవీఎంసీ నుంచే మెసేజీలు వెళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహారణగా చెప్పారు. జీవీఎంసీ పరువు, ప్రతిష్టలు మంటగలిసిపోయేలా చేసిన అధికారుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని, బాధ్యులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, చర్యలు చేపట్టాలని మేయర్, కమిషనర్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నట్టు మూర్తి యాదవ్ స్పష్ట చేశారు.
కమిషనర్‌కు విచారణకు ఆదేశం
కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన వినతిపత్రంపై మేయర్ వెంటనే స్పందించారు. తక్షణమే రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను ఆమె ఆదేశించారు. బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టాలంటూ సిబ్బందికి కూడా ఆదేశాలివ్వాలని ఆమె ఆదేశించారు.