విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 31: పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని సచివాలయం వాలంటీర్ హతమార్చిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సుజాతనగర్‌లోని 95వ వార్డు పురుషోత్తపురం సచివాలయంలో రాయవరపు వెంకటేష్ (26) వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతోపాటు పార్ట్ టైం జాబ్ గా సమీపంలోని ఫుడ్ కోర్టు దుకాణంలో నెలరోజుల క్రితం వెంకటేష్ చేరాడు. ఆదివారం రాత్రి షాపు పనులు ముగించుకొని షాప్ యజమాని, తన తల్లికి మిగిలి పోయిన చికెన్ అందజేయాలని చెప్పాడు. దీంతో సుజాతనగర్‌లోని 80 అడుగుల రోడ్డు శివారులో నివాసముంటున్న యజమాని తల్లి కోటగిరి వెంకటలక్ష్మి (72) ఇంటికి వెంకటేష్ వెళ్లాడు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా మంచంపై నిద్రించి ఉండడంతోపాటు ఆమె మెడలోని బంగారు గొలుసును వెంకటేష్ గుర్తించాడు. యజమాని తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగలించే ప్రయత్నంలో వృద్ధురాలిని తలదిండుతో హత మార్చి బంగారంతో ఉడాయించాడు. కొద్ది సమయం తర్వాత షాపు యజమాని ఇంటికి వచ్చేసరికి తల్లి విగతజీవిగా పడి ఉండడంతో వెంటనే అతను పోలీసులకి సమాచారం అందించాడు. దీంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించాడు. సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా రాత్రి సుమారు 10 గంటల సమయంలో వెంకటేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన కొద్ది గంటలలోనే అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెంకటేష్ ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికి తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.