జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు . ఏఎస్సై, ముగ్గురు ప్రయాణికుల మృతి . తెల్లవారుజామున ఘటన . చైన్ లాగి రైలు నుంచి దూకి పారిపోయే యత్నం
జైపూర్, న్యూస్ లీడర్, జూలై 31: రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో తెల్లవారు జామున 5 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్‌కుమార్ చౌదరి ఉన్నట్టుండి ఆర్పీఎఫ్ ఏఎస్సై టికారామ్ మీనాపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత మరో బోగీలోకి వెళ్లి ప్రయాణికులపై కాల్పులు జరిపారు. దీంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం నిందితుడు దహిసర్ స్టేషన్ వద్ద చైన్ లాగి రైలు నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అతడి నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బీ5 కోచ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాల్పులకు గల కారణం తెలియాల్సి ఉంది.