అనుకున్నట్టే జరిగింది. మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. గతంలో చేసిన హెచ్చరికకు తగ్గట్టుగా చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయనుంది.
దేశం మొత్తాన్ని కుదిపేసిన ఘటన అది. ఇద్దరు మహిళల్ని వివస్త్రల్ని చేసి ఊరేగించడమే కాకుండా ఆ మహిళల శరీర భాగాల్ని నలుపుతూ అత్యంత పైశాచికంగా వ్యవహరించిన అల్లరి ముూక చేష్టలకు సంబంధించిన వీడియో మూడు నెలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 4న ఈ ఘటన జరిగనట్టుగా తెలుస్తోంది. మే 3 నుంచే మణిపూర్లో ఇంటర్నెట్ బంద్ అయింది. మణిపూర్ హింసపై గతంలోనే అంటే ఇటీవలే సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా మణిఫూర్పై మాట్లాడారు. మీరు కలగజేసుకుంటారా లేక మేం కలగజేసుకోవాలా అని హెచ్చరించారు.
మణిుపూర్లో మొయితెయ్, నాగా, కుకీల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది.. ప్రభుత్వం చోద్యం చూస్తుండటంతో ఊరంతా తగలబడిపోతోంది. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోగా వేలాది ఇళ్లు దగ్దమయ్యాయి. అన్నింటికీ మించి స్త్రీలపై అత్యంత దారుణంగా అత్యాచారాలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు ఇద్దరు మహిళల వీడియో మణిపూర్ హింసను పరాకాష్ఠగా నిలిచింది.
సుప్రీంకోర్టు హెచ్చరించినా పరిస్థితి మారకపోవడంతో ఈసారి చర్యలకు ఉపక్రమించింది. మణిపూర్ ఘటనపై ఇద్దరు మహిళా రిటైర్డ్ న్యాయమూర్తులు, నిపుణులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. సిట్ సభ్యులు మణిపూర్ లో పర్యటించి బాధితులతో మాట్లాడతారని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. మరోవైపు మణిపూర్లో జరుగుతున్నది జాతి హింస కాదని, మయన్మార్ నుంచి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారమని మొయితెయ్ కమ్యూనిటీ వేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాస్తవాలతో పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. వీడియో బయటకు వచ్చేంతవరకూ ఏం చేస్తున్నారంటూ కేంద్రంపై మండపడింది సుప్రీంకోర్టు. మే 3న సంఘటన జరిగితే ఇప్పటి వరకూ ఎన్ని ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయని ప్రశ్నించింది.