రోడ్డుకిరువైపులా థ్యాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు
దారి పొడవునా మానవ హారాలు
వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో వెల్లువెత్తిన జనం
కాన్వాయ్‌లో అభివాదం చేసుకుంటూ చిరునవ్వుతో పలకరించిన జగన్ గంట ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 1: విశాఖలో రూ.600కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇనార్బిట్ మాల్ పనుల శంకుస్థాపనకు శనివారం నగరానికి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం జనం పడిగాపులు కాశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కైలాసపురంలోని మాల్ ఏర్పాటు కానున్న ప్రాంగణం వరకు రోడ్డుకిరువైపులా శనివారం ఉదయం నుంచే సీఎంను పలకరించేందుకు 12వార్డుల నుంచి జనం వేచి చూశారు. వేలాది మంది ప్రజలు జై జగన్, థ్యాంక్యూ సీఎం సార్ అనే ప్లకార్డులు పట్టుకుని దారి పొడవునా మానవ హారాలుగా ఏర్పడి సీఎంకు స్వాగతం పలికారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ 11.15గంటలకు రావాల్సి ఉండగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే 11.25గంటలకు బయల్దేరి ఇనార్బిట్ మాల్‌కు గంట ఆలస్యంగా చేరుకున్నారు.
తొలిసారి ‘స్లో’గా కాన్వాయ్..
ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ తొలిసారి కాన్వాయ్‌లో మెల్లగా ముందుకు కదిలారు. ఎయిర్‌పోర్టు, ఎన్ఏడీ కూడలి, మర్రిపాలెం, కంచరపాలెం జంక్షన్ల మీదుగా కారులో వస్తూనే చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తూ, అభివాదం చేయడం గమనార్హం. ఆ సమయంలో డ్వాక్రా సహా వివిధ గ్రూపుల మహిళా సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున జగన్ కాన్వాయ్ పూలు చల్లుతూ పలకరించారు. నెడ్ క్యాప్ చైర్మన్, ఉత్త్తర నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి కేకే రాజు పేరిట అన్ని కూడళ్లతో పాటు ఇనార్బిట్ మాల్ పనుల ప్రాంగణంలో భారీ ఎత్తున స్వాగత ద్వారాలు కనిపించాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఆకట్టుకున్నాయి. సుమారు 10వేల మంది జనం జయజయధ్వానాల మధ్య సీఎం కాన్వాయ్ ప్రాంగణంవైపు వెళ్లిపోయింది. అయితే సమయం ప్రకారం జగన్ రాక ఆలస్యం కావడంతో జనం కొంతమంది మధ్యలోనే ఇళ్లకు వెళ్లిపోయారు.
మూడు జిల్లాల నుంచి 400మంది పోలీసుల రాక
సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు, ఇనార్బిట్ మాల్ ప్రాంగణం, ఏయూ వద్ద డీసీపీ స్థాయి నుంచి హోంగార్డు వరకు బందోబస్తు కనిపించింది. సోమవారం సాయంత్రం నాటికి తొలుత 600మందితోనే బందోబస్తు స్కీం తయారు చేయగా, సీఎం విజట్కు కనీసం 25వేల మందితో స్వాగత కార్యక్రమాలేర్పాటు చేస్తున్నామని, ప్రతి కూడలి వద్ద వందలాది మంది జనం వేచి చూసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని అధికార వైసీపీ నేతలు పోలీసులతో చర్చించారు. దీంతో మంగళవారం ఉదయం నాటికి ఇతర మూడు జిల్లాల నుంచి మరో 400మంది సిబ్బందిని రప్పించి మొత్తం 1000మందికిపైగా విశాఖలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయించారు. ఏయూ వద్ద 50మంది పర్యవేక్షించారు.