. రూ.99.75 మేర ఊరట
. వాణిజ్య సముదాయవర్గం హర్షం
. మంగళవారం నుంచి అమల్లోకి…
ఢిల్లీ, న్యూస్ లీడర్, ఆగస్టు 1: వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు సవరించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,680కు దిగొచ్చింది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. కొత్త ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రతినెల మొదటి రోజున దేశంలోని చమురు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రకటించి మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. ఈ క్రమంలో మంగళవారం సిలిండర్ ధరలను తగ్గించాయి. గత నెలలో అత్యంత స్వల్పంగా రేటును తగ్గించిన కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరను రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో ఇప్పటికే ధరల భారంతో వ్యాపార నిర్వహణలో ఇబ్బందిపడుతున్న హోటళ్లు, ఇతర వ్యాపారులకు ఇది స్వల్ప ఊరటను అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త ధరలు వచ్చిన తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. ఢిల్లీలో రూ.1,680, ముంబైలో రూ.1,640, కలకత్తాలో రూ.1,802, చెన్నైలో రూ.1,852, హైదరాబాదులో రూ.1,918గా కొనసాగుతున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధర హైదరాబాదులో రూ.1,155గా కొనసాగుతోంది. ఇవి మార్చి నెలలో పెరిగిన తర్వాత ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు, ఇంధన ధరలు సాధారణంగా అంతర్జాతీయ ద్రవ్యోల్బణం రేట్లు, ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇదిలా ఉండగా ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధరలను జూలైలో 8.5 శాతం పెరిగాయి. ప్రతి పదిహేను రోజులకు ధరలను సవరిస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది మధ్యతరగతి భారతీయ కుటుంబాలు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.