` ట్విటర్‌పై శాన్ఫ్రాన్సిస్కో వాసుల ఫిర్యాదు
` సంస్థ ప్రధాన కార్యాలయంపై నుంచి సంస్థ లోగో తొలగించిన అధికారులు
శాన్ఫ్రాన్సిస్కో : ట్విటర్ లోగో మార్చిన నేపథ్యంలో ఆ సంస్థకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ట్విటర్‌ను ఓ సూపర్ యాప్‌గా మార్చే క్రమంలో దాని అధిపతి ఎలాన్ మస్క్ సంస్థ లోగాను మార్చారు. ఈ క్రమంలో ట్విటర్ పిట్ట స్థానంలో X లోగో వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంపై ఎక్స్ లోగోను భారీగా ఏర్పాటు చేశారు.
అయితే, దీనిపై వెంటనే స్థానికుల నుంచి ఫిర్యాదుల పరంపర మొదలైంది. ఎక్స్ లోగో డిస్ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా రాత్రుళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి పడుతుందని ఫిర్యాదులు అందాయి. దీనివల్ల తమకు నిద్రాభంగం ఏర్పడుతోందని 24 మంది స్థానికులు అధికారులు దృష్టికి తెచ్చారు. దీంతో శాన్ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం లోగోను తొలగించింది.
దీనిపై శాన్ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్ హన్నన్ మాట్లాడుతూ.. ట్విటర్ ఎక్స్ లోగోపై మాకు ఫిర్యాదులు అందాయి. ఆ సంస్థ కూడా లోగోను అనుమతి లేకుండా ఏర్పాటు చేసింది. దీనికి తోడు లోగోలో ఏర్పాటు చేసిన లైట్ల వల్ల వెలువడే విపరీతమైన కాంతి రాత్రిళ్లు తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతో మా బృందం లోగో ఏర్పాటును సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు నిర్ధారించింది. దీంతో దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం అని వివరణ ఇచ్చారు.
అంతకుముందు.. ఎక్స్ లోగో ఏర్పాటుపై శాన్ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం సైతం విచారణకు ఆదేశించింది. ఒక సంస్థ లోగో గుర్తును మార్చాలనుకున్నప్పుడు డిజైన్, భద్రత కారణాల దృష్ట్యా ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ట్విటర్ ప్రతినిధులు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా లోగో ఏర్పాటు చేయడం, దానిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో తొలగించారు.