పాములపాడు, న్యూస్ లీడర్, ఆగస్టు 1: ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో నంద్యాల జిల్లాకు చెందిన యువ జవాను వీరమరణం పొందారు. పాములపాడు మండలం మద్దూరు పంచాయతీకి చెందిన సురేంద్ర(24) 2019లో సైన్యంలో చేరారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం అందింది. మూడు రోజుల క్రితమే తమతో ఫోన్లో మాట్లాడిన కుమారుడు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి తల్లిదండ్రులు సుబ్బమ్మ, సుబ్బయ్య తల్లడిల్లుతున్నారు. సెప్టెంబరులో వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సురేంద్ర పార్థివదేహం బుధవారం ఉదయానికి స్వగ్రామం చేరే అవకాశం ఉంది.