. డీసీవో, డీఆర్వో సహా ముగ్గురికి హైకోర్టు నోటీసులు
. ఎందుకు చర్యలు చేపట్టకూడదో చెప్పాలంటూ ఫారం`1జారీ
.సెప్టెంబర్ 6కు విచారణ వాయిదా
అమరావతి, న్యూస్‌లీడర్, ఆగస్టు 2 : పాయకరావుపేట పీఏసీఎస్‌లో పర్సన్ ఇన్చార్జ్ నియామకం కేసు మలుపులు తిరుగుతోంది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ హైకోర్టు బుధవారం ఫారం`1 జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో తాడి నర్సింహమూర్తి అనే సభ్యుడు అప్పట్లో పర్సన్ ఇన్చార్జ్గా పని చేసేవారు. అయితే ఆయన స్థానంలో దేవవరపు రాజేష్ ఖన్నా అనే మరో సభ్యుడ్ని నియమిస్తూ ప్రభుత్వం జీవో 492ని జారీ చేసింది. ఈ నియామకాన్ని తప్పుబడుతూ సదరు నర్సింహమూర్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఖన్నా నియామకాన్ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. అయినప్పటికీ తాడి నర్సింహ మూర్తిని గానీ, అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ని గానీ నియమించకుండా రాజేష్ ఖన్నానే కొనసాగించడంపై నర్సింహమూర్తి కోర్టులో మళ్లీ ధిక్కార కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టులో వాదోపవాదనలు జరిగాయి.
ఈ నేపథ్యంలో అధికారులు, రాజేష్ ఖన్నా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ జిల్లా కో`ఆపరేటివ్ అధికారి కిరణ్‌కుమారి, జిల్లా రిజిస్ట్రార్ కె.సరళకుమారి సహా దేవవరపు రాజేష్ ఖన్నా కోర్టు ఎదుట హాజరు కావాలంటూ న్యాయమూర్తి ఆర్.రఘునందనరావు ఫారం`1 జారీ చేశారు. తాడి నర్సింహమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది వీవీఎన్ నారాయణరావు వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.