సర్వే నంబర్ 348లో భవన నిర్మాణ అనుమతుల్ని రద్దు చేయాలి
ఆ స్థలంలో పౌర గ్రంథాలయం నిర్మించాలి
పౌర, ప్రజా సంఘాల డిమాండ్
అనకాపల్లి, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: అనకాపల్లి గాంధీనగర్`మిరియాల కాలనీ టౌన్ సర్వే నంబర్ 348లోని మున్సిపల్ స్థల కబ్జాపై లోకాయుక్త విచారణ చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై ప్రజా సంఘాల నేతలు పీఎస్ అజయ్ కుమార్, ఎ.బాలకృష్ణ, రాజాన దొరబాబు తదితరులు గత జూన్ 19న జీవీఎంసీ కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదిచ్చారు. పట్టణం నడిబొడ్డునే ఇన్నేసి అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఏసీబీ, సీఐడీకి ఫిర్యాదులిచ్చారు. 60 చదరపు గజాల ఇంటికున్న డిక్రీని చూపించి 534 చదరపు గజాల మున్సిపాలిటీ స్థలాన్ని సొంత జిరాయితీ స్థలంగా అమ్మేసిన ఘటనపై భూకబ్జా కేసు నమోదు చేయకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తుల భవన నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశారు. అనుమతులు పొందిన వ్యక్తులు కూడా సదరు స్థలం వెనకాలే ఉన్న మిగిలిన స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు వీలుగా ముందు భాగాన్ని పూర్తిగా ఆక్రమించి నిర్మాణాన్ని చేపడుతున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. పూర్తి ఆధారాలతో వామపక్ష పార్టీల నేతలు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు చేసినా అధికారులు విచారణ చేపట్టలేదు.
నిరాటంకంగా నిర్మాణం
ప్రభుత్వ స్థలంలో నిరాటంకంగా నిర్మాణాలు జరిపించేందుకు అధికారులూ పరోక్షంగా సహకరిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అక్కడ ప్రజాప్రయోజనమైన పౌర గ్రంథాలయాన్ని నిర్మించాలన్న డిమాండ్‌నూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు లొంగిపోయి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. మున్సిపల్ స్థలం కబ్జా వెనుక ఎంతోమంది పెద్దలున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రజాసంఘాల నేతలు లోకాయుక్తను ఆశ్రయించారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. అంతేకాకుండా విచారణ పూర్తయ్యేంత వరకు సర్వే నంబర్ 348లో భవన నిర్మాణ అనుమతుల్ని రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆక్రమణదారులిచ్చే లంచాలకు కక్కుర్తి పడితే న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఈ సందర్భంగా అజయ్ కుమార్, ఎ.బాలకృష్ణ, రాజాన దొరబాబు హెచ్చరించారు. అనకాపల్లి పట్టణ పౌరులు, మేధావులు, విద్యార్థి యువజన సంఘాలు తక్షణమే స్పందించి, ఆ స్థలాన్ని స్థలాన్ని స్వాధీనం చేసుకుని, గ్రంథాలయ నిర్మాణానికి నిధుల మంజూరుకు స్థానిక మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని కూడా వారు చెబుతున్నారు.