యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా
కళ్లముందు తరలిపోతున్నా ప్రేక్షకపాత్రలో అధికారులు
అచ్యుతాపురం, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: అచ్యుతాపురం మండలంలో గ్రావెల్ మట్టి దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రావెల్ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అధికారం మాదేనన్న ధీమాతో వైసీపీ నాయకులు ఈ దందా నడిపిస్తున్నారు. ఒకే బిల్లుతో ఎన్ని లారీల గ్రావెల్ తరలిస్తున్నా మైనింగ్ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడంలేదన్న విమర్శలున్నాయి. ప్రజలు అడ్డుకుంటే పోలీసులచే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ తంతంతా అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాథపురంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి భూమిని చదును చేయడానికి తప్పుడు బిల్లులతో గ్రావెల్ తరలించిన లారీలు ఎన్ని తిరిగినా ఒకే బిల్లుతో రవాణా చేస్తున్నారు. కశింకోట మండల పరిధిలో క్వారీ నుంచి లారీలతో గ్రావెల్ రావడంతో గ్రామస్థులు అభ్యంతరం చెబుతూ లారీలను అడ్డుకున్నారు. చిన్న రోడ్డులో 50 టన్నుల బరువు ఉండే టిప్పర్లను ఏవిధంగా తీసుకొస్తారని, రోడ్డు మరమ్మతులకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీయగా…ఓ ప్రజా ప్రతినిధికి చెందిన భర్త భూముల్లోకి గ్రావెల్ తీసుకెళ్తున్నామని, అన్ని రకాలైన అనుమతులున్నాయని బుకాయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సెజ్‌లోని ఒక కంపెనీకి గ్రావెల్ వెళ్తున్నట్లు గనులశాఖ అధికారులు నిర్ధారించిన బిల్లును ధైర్యంగా చూపించి వెళ్లిపోయారు. గ్రామస్థులు చూస్తుండగానే ఒక లారీ డ్రైవర్ తీసుకొచ్చిన బిల్లును మరో లారీ డ్రైవర్‌కు అందిస్తూ గుట్టుగా పనులు జరిపేస్తున్నారు. అధికార పార్టీ నేతల అక్రమ గ్రావెల్ దందాకు జగన్నాథపురంలో ప్రైవేటు భూముల్లో నిల్వ చేస్తున్న గ్రావెల్‌ను చూసినవారు ఇదేమి అక్రమమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.