అచ్యుతాపురం, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: సంక్షేమ పథకాలను పొందడానికి తప్పుడు మార్గాలలో నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించారనే అభియోగంపై ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, సహకరించిన ఓ వలంటీర్‌ను అరెస్టు చేసినట్లు అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు వెల్లడిరచారు. దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన సచివాలయంలో డిజిటల్ సహాయకుడుగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ (34) అవివాహితడైనా వివాహం జరిగినట్లు పంచాయతీ కార్యదర్శి డిజిటల్ కీని ఉపయోగించి నకిలీ వివాహపత్రం సృష్టించారని, ఇతనితోపాటు ఇదే సచివాలయంలో మహిళా పోలీసులుగా పనిచేస్తున్న బురుగుబెల్లి రాజేశ్వరి (32), పైలా వెంకటలక్ష్మి (31)లు భర్తల నుంచి విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని పంచాయతీ కార్యదర్శి బి. రజని అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, గ్రామానికి చెందిన వలంటీర్ చొక్కాకుల నానాజీ (34)లపై ఐపీసీ 468, 471 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరికి పోలీసు స్టేషన్ ద్వారా 41 నోటీసులు అందించి స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు సీఐ, ఎస్సైలు తెలిపారు. నకిలీ డోంగెల్, తప్పుడు వివాహ, విడాకుల పత్రాలపై విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి కోర్టుకు ఛార్జీషీటు సమర్పించి శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు.