జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర తాకట్టుపెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ను బీజేపీ అధిష్ఠానం పట్టించుకోవటం లేదని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రం సర్వనాశనం అయ్యేలా మోదీ చేశారని చెప్పారు.
“2019లో నాదే తప్పు. ఒకరితో పొత్తులు పెట్టుకుందామని చివరి వరకు ఆగాం. వారు మోసం చేశారు… అమ్ముడుపోయారు. పవన్ కల్యాణ్‌కు నిలకడలేదు. పవన్ నిలకడగా ఉంటూ, ప్రజాశాంతి పార్టీతో కలిస్తే జనసేనకు ఓటు బ్యాంకు పెరుగుతుంది. నిలకడ లేకనే, కాపులందరూ ఆయనకు దూరమయ్యారు. తోట చంద్రశేఖర్ వంటి రిటైర్డ్ ఐఏఎస్, జేడీ లక్ష్మీనారాయణ వంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, రావెళ్ల కిశోర్ వంటి నేతలు కూడా జనసేనలో చేరి వెంటనే వదిలేశారు.
కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పవన్ ను వదిలేశారు. వీళ్లందరూ ఎందుకు వదిలేశారంటే కారణం ఒక్కటే. మోదీకి పవన్ మద్దతు ఇవ్వడమే. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే మోదీ. అందుకే పవన్‌ను నాతో కలవమంటున్నాను. నేను రియల్ పెద్ద కాపును, మున్నూరు కాపును… బీసీని. నువ్వు మన బీసీలను, కాపులను తప్పుదోవ పట్టించి మూడ్నాలుగు శాతం ఓట్లను చీల్చవద్దు” అంటూ పవన్‌ను ఉద్దేశించి కేఏ పాల్ వ్యాఖ్యానించారు.