. కొత్త టోల్ వ్యవస్థకు రూపకల్పన
. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ స్థానంలో నూతన విధానం
. ఇప్పటికే ఢిల్లీ-మీరఠ్ ఎక్స్‌ప్రెస్ వేలో ప్రయోగాత్మకంగా అమలు
ఢిల్లీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 3: టోల్‌ప్లాజాల వద్ద నిరీక్షణ సమయాన్ని తగ్గించడం ద్వారా ప్రయాణ సమయాన్ని కుదించాలని భావిస్తున్న కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉంది. టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా రయ్యిమంటూ దూసుకుపోయేలా నూతన విధానాన్ని తీసుకురాబోతోంది. ఈ మేరకు ట్రయల్స్ జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ నిన్న తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం స్థానంలో అడ్డంకులు లేని టోల్ వ్యవస్థను, లేదంటే ఓపెన్ టోల్ విధానాన్ని తీసుకురాబోతోన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానంతో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించగలిగామని, కొత్త విధానంతో అది 30 సెకన్ల లోపుకు తగ్గుతుందన్నారు. ఉపగ్రహం, కెమెరాల ఆధారంగా పనిచేసే ఈ సరికొత్త విధానాన్ని ఢల్లీి- మీరఠ్ ఎక్స్‌ప్రెస్ వేలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. టోల్‌ప్లాజా వద్దనున్న కెమెరా.. వాహన రిజిస్ట్రేషన్ నంబరును స్కాన్ చేసి సమాచారాన్ని సేకరిస్తుందని, ప్రయాణించిన దూరాన్ని బట్టి అది చార్జీలు వసూలు చేస్తుందని మంత్రి వివరించారు.