తగాదా వద్దన్నందుకు రూంబాయ్తో గొడవ
16న ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ
దర్యాప్తు చేపట్టిన గోపాలపట్నం పోలీసులు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 3: లాడ్జీ గది మేడపై నుంచి కింద పడి ఓ రౌడీషీటర్ మృతి చెందాడు. విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సుజాత నగర్‌కు చెందిన జంపంగి షణ్ముఖ (30) అల్లూరి జిల్లా హుకుంపేటలో ఉంటున్న తన సోదరుడి వద్ద కొన్నాళ్లగా ఉంటున్నాడు. ఆయనపై పెందుర్తి పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. హైదరాబాద్‌లో ఉంటున్న స్నేహితుల వద్దకు వెళ్లి ఇటీవల తిరిగొచ్చాడు. వారిలో ఒక స్నేహితుడి పుట్టిన రోజు కావడంతో బుధవారం గోపాలపట్నం సమీప కుమారి కల్యాణ మండపంలో గది అద్దెకు తీసుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. అయితే షణ్ముఖ సహా మరో ఇద్దరు లాడ్జీ గదిలో పదే పదే కేకలు వేస్తుండడంతో రూంబాయ్ వారిని వారించారు. అందుకు ఆగ్రహించిన షణ్ముఖ బృందం ఆ రూంబాయ్‌ను కొట్టారు. ఎంత వారిస్తున్నా వినకపోవడంతో తన యజమాని తనను మందలిస్తారనే భావనతో షణ్ముఖ బృందం ఉన్న గదికి రూంబాయ్ బయటి నుంచి తాళం వేసేశాడు. అది గమనించిన షణ్ముఖ తనపై అప్పటికే రౌడీషీట్ ఉండడంతో పోలీస్ కేసు అవుతుందని భయపడి కిటికీ ద్వారా బెడ్‌షీట్ సాయంతో లాడ్జీ బయటకు వెళ్లిపోదామని భావించాడు. ఈ క్రమంలో బాల్కనీలోనుంచి బయటకు గెంతేసే క్రమంలో కిందపడి రాత్రి 2గంటల సమయంలో అక్కడికక్కడే మృతి చెందాడు. షణ్ముఖ ఓ ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకోగా ఈ నెల 16న ఇంటర్వ్యూ కూడా ఉంది. వారంతా రూంలో అతిగా మద్యం సేవించి తగాదాకు దిగిన నేపథ్యంలో మద్యం మత్తులో అలా కిందకు దూకేసి ఉంటాడని గోపాలపట్నం పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, షణ్ముఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామని సీఐ ఈ.నర్సింహరావు తెలిపారు. క్లూస్ టీం వివరాలు సేకరించింది.