విద్యుదాఘాతానికి గురై ముగ్గురి మృతి ` ఇద్దరు కూలీలను కాపాడేయత్నంలో అంగన్వాడీ ఆయా దుర్మరణం ` విజయనగరం జిల్లాలో విషాదం
సంతకవిటి, న్యూస్లీడర్, ఆగస్టు 3 : విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామంలో గురువారం ఉదయం విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన రామినాయుడు గృహనిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం భవన నిర్మాణ కార్మికులు పి.కేసరి (22), జి.చంద్రశేఖర్ (18) పనుల నిర్వహణకు వెళ్లారు. ఈ క్రమంలో వారు పట్టుకొని ఉన్న ఇనుపచువ్వ.. ప్రమాదవశాత్తు సమీపంలోని విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కూలీలు ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడకు సమీపంలో ఉన్న అంగన్వాడీ ఆయా రియమ్మ (57) వారిని కాపాడేందుకు యత్నించగా.. ఆమె కూడా ప్రమాదానికి గురవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై లోకేశ్వరరావు, అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు.