` మిర్చి మరీ రిచ్చు
` అల్లం కల్లోలం
` మార్కెట్లో గూబ గుయ్యమంటున్న కూరగాయల ధరలు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 3: పరగడుపునే అల్లం తినాలని ఉందా..గూభగుయ్యమంటుంది. అల్లం టీ కోసం కొన్నాళ్లు దూరంగా ఉండడం బెటరు. ఎందుకంటే అల్లం రేటు మండిపోతోంది.. టమాటా కావాలా నాయనా..యూట్యూబ్‌లో టమాటా లేకుండా రుచికరంగా ఉండే కూరలు చూసి వంట చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పట్లో టమాటా ధరలు కిందకు దిగే పరిస్థితి లేదు. పచ్చిమిర్చి ధర కూర వండకుండానే ఘాటెక్కిపోతోంది. మొత్తమ్మీద కూరగాయల ధరలు మంటపుట్టిస్తున్నాయి. వాస్తవానికి వర్షాకాలం, ఆషాడంలో ముహూర్తాలుండవు. ధరలు తగ్గాలి. అయినా రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. రైతుబజార్లలో కూరలు కొనుగోలు చేద్దామంటే చాంతాడంత క్యూ. కేజీ రూ.50ధర ఉన్న సబ్సిడీ టమాటా కోసం జనం బారులుతీరుతున్నారు. ఉదయాన్నే ఆధార్/ రేషన్ కార్డు సంచిలో పెట్టుకుని వెళ్తే మధ్యాహ్నానానికి గానీ తిరిగి రావడం లేదు. ఎందుకంటే.. సాధారణ మార్కెట్లో టమాటాల ధర రూ.200వరకు పలుకుతోంది. ఇటీవల రూ.230కి కూడా అమ్మారు. రైతుబజార్‌లోని చిల్లర స్టాళ్లలోనూ రూ.140కి తక్కువ లేదు.
ఎందుకిలా?
అల్లం ధర మార్కెట్లో మొన్నటి వరకూ రూ.300వరకు వెళ్లింది. ప్రస్తుతం రైతుబజార్లో కేజీ రూ.196 ఉండగా, బయటి మార్కెట్లో రూ.230వరకు పలుకుతోంది. అరకు ప్రాంతంలో అల్లం పంట విరివిగా ఉండేది. ఏజెన్సీల్లోనూ మరికొన్ని వాణిజ్య పంటలపై గిరిజనులు మక్కువ చూపిస్తుండడంతో ఈసారి దిగుబడి తగ్గడంతో ధర ఘాటెక్కింది. అందులోనూ వర్షాల సమయంలో నాణ్యమైన అల్లం కూడా వచ్చేది కాదు. ఇప్పుడు కొంత ఫరవాలేదని రైతుబజార్ నిర్వాహకులు చెబుతున్నారు.
మదనపల్లె టూ ముంబై
టమాటా గురించి ప్రస్తుతం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ధర ఎగబాకడం, నాణ్యమైనవి మార్కెట్లో లేకపోవడం, టమాటా అధికంగా తింటే వైరస్ వ్యాపిస్తోందనే వార్తలు రావడంతో చాలామంది వాటి జోలికే పోవడం లేదు. టమాటా నిత్యావసర వస్తువు కాకపోయినా చారులో టమాటా లేకపోతే ముద్ద దిగనివారు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి టమాటా వస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ టమాటాకు డిమాండ్ పెరగడంతో ముంబై సహా పలు ఇతర రాష్ట్రాలకు అవి ఎగుమతి అయిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నిరుపేద కూడా కోటీశ్వరుడైపోతున్న సందర్భాలు ఉన్నాయి.
వర్షంలో నాణ్యమైన మిర్చి గగనమే..
మిర్చి ధర కేజీ మొన్నటి వరకూ రూ.120పైనే ఉండేది. ప్రస్తుతం రైతుబజార్లోనే కేజీ ధర రూ.80వరకు పలుకుతోంది. బయట మార్కెట్లో రూ.110వరకు ఉంది. వర్షాల నేపథ్యంలో సాధారణంగానే నాణ్యమైన మిర్చి దొరికేవి కావు. ప్రస్తుతం సరకు దిగుబడి తక్కువగానే ఉందని, అందుకే ధరలు మండిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల్లో బంగాళా దుంపలు, ఉల్లి మినహా ఆగాకరకాయలు, బీన్స్, బీరకాయి, గోరు చిక్కుడు వంటి ధరలు అధికంగానే ఉన్నాయి. ఏదైనా కనీసం కేజీ రూ.50వరకూ పలుకుతోంది. విశాఖ మార్కెట్‌కు వారం రోజులుగా టమాటా సరకు రాలేదు. దీంతో రైతుబజార్లలోనూ డిమాండే. గురువారం మర్రిపాలెం రైతుబజార్లో సరకు కనబడగానే చాంతాడంత క్యూ కనిపించింది. సీతమ్మధార, ఎంవీపీకాలనీ బజార్లకు స్టాకు ఇవ్వలేదు. ములగాడ, అనకాపల్లి, మధురవాడ, గాజువాక, స్టీల్‌ప్లాంట్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, పెందుర్తి వంటి చిన్న బజార్లకు మాత్రం అప్పుడప్పుడు స్టాక్ వస్తోంది. మదనపల్లె నుంచి భారీగా సరకు దిగుమతి అయితేనే టమాటా ధర తగ్గుతుందని, అంతరవరకు రూ.140ధర తగ్గేదేలే అంటూ వ్యాపారులు చెబుతున్నారు.