ఐదు పోలీస్ స్టేషన్లకు అధికారులే లేరు
సిటీ వీఆర్‌లో ఆరుగురు, రేంజిలో 20 మంది ఇన్స్పెక్టర్లు
రాజకీయ ఒత్తిళ్లతో పోస్టులు భర్తీ కాని పరిస్థితి
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 3 : విశాఖ పోలీస్ శాఖకు సీఐలే కరువయ్యారు. ఎందుకంటే ఐదు పోలీస్ స్టేషన్లకు ప్రస్తుతం అధికారులు లేరు. కిందిస్థాయి సిబ్బందితోనే స్టేషన్లను నడిపిస్తున్నారు. మరీ విచిత్రం ఏంటంటే.. విశాఖలో పేరొందిన పెందుర్తి, హార్బర్ వంటి చోట్ల కూడా సీఐ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వాస్తవానికి సిటీ వీఆర్ (వేకెంట్ రిజర్వు)లో ప్రస్తుతం ఆరుగురు సీఐలు ఉన్నారు. అలాగే డీఐజీ వద్ద రేంజి పరిధిలో మరో 20 మంది సీఐలు ఖాళీగానే ఉన్నారు. అయినా విశాఖ వంటి మహా నగరంలో చాన్నాళ్లగా ఐదు పోలీస్ స్టేషన్లకు సీఐల్నే వేయడం లేదంటే పరిస్థితుల్ని అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా ఒత్తిళ్లు రావడంతో పాటు తమ వారికే పోస్టింగ్ ఇవ్వాలంటూ సలహాలు అధికమైపోతున్నాయని, అందుకే ఏ పోలీస్ స్టేషన్‌కు ఏ అధికారిని వేయాలో అని ఉన్నతాధికారులు యోచిస్తున్నారని తెలుస్తోంది. హార్బర్ శాంతిభద్రతలు, హార్బర్ క్రైం, పెందుర్తి, నార్త్ ట్రాఫిక్, వెస్ట్ క్రైం విభాగాలకు సీఐలు లేకపోవడంతో కొన్ని చోట్ల ఎస్ఐలతోను మరికొన్ని చోట్ల సమీప పోలీస్ స్టేషన్ల సీఐలే ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు.
అదేంటో..పెందుర్తి!
విశాఖ శివార్లలో ఉన్న పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు ఏడాది వ్యవధిలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు మారారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అధికారి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆ స్టేషన్ పరిధిలో నేరాలిప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. భూ లావాదేవీలు తక్కువేం కాదు. అంతేకాదు.. గతంలో పెందుర్తి పీఎస్‌లో నలుగురు ఎస్ఐలు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ వంటి చిన్న పోలీస్ స్టేషన్లోనూ ముగ్గురు ఎస్ఐలు ఉంటే పెందుర్తి వంటి పెద్ద పీఎస్‌కు మాత్రం ఇద్దరే ఉండడం గమనార్హం. అటు ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ అధికారి) లేక, ఇటు ఉండాల్సిన కంటే తక్కువ సంఖ్యలో ఎస్ఐలు ఉండడంతో ఈ పీఎస్‌ను అధికారులు పట్టించుకోవడం లేదనే అపవాదు ఉంది. అయితే రాజకీయంగా ఇక్కడి పోస్టింగ్‌కు డిమాండ్ ఉందని, భారీ స్థాయిలో ఒత్తిళ్లు తెస్తేనే ఇక్కడ పోస్టు భర్తీ అవుతుందని సిబ్బందే చెబుతున్నారు. ఇప్పటికే ఓ సీఐ స్థానిక ప్రజాప్రతినిధికి రూ.10 లక్షల వరకు ముడుపులిచ్చి అక్కడి పోస్టింగ్‌ను తనకే ఇప్పించాలని కోరారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. త్వరలో న్యూపోర్ట్, గాజువాక క్రైం, ఫోర్త్‌టౌన్, గోపాలపట్నం స్టేషన్ల అధికారుల్ని మార్చుతారని, వారితో పాటే ఖాళీ పోస్టుల్ని భర్తీ చేస్తారని తెలుస్తోంది.
కాగా, సివిల్ దుస్తులు ధరించే ఓ సీఐ స్థాయి అధికారి..ఉన్నతాధికారిని తప్పుదోవ పట్టిస్తూ పోస్టింగ్‌ల విషయంలోనూ తలదూర్చుతున్నారని, ఇప్పటికే పలు ఆరోపణలెదుర్కొన్న ఆ వ్యక్తి విశాఖ శాంతిభద్రతలపై కనీసం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.