డెహ్రాడూన్, న్యూస్‌లీడర్, ఆగస్టు 4 : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో అకాల వరదలు తలెత్తడంతో కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. శుక్రవారం కేదార్నాథ్ యాత్రకు వెళ్లే గౌరీకుండ్ ప్రాంతంలో వరదల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో ఇళ్లు, దుకాణాలు ధ్వంసం కాగా, పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 12 మంది ఆచూకీ గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, కొండచరియల కింద ఎవరూ లేరని గుర్తించిన అధికారులు.. గల్లంతైన 12 మంది వరదల్లో కొట్టుకుపోయింటారని అనుమానిస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు. గల్లంతైన వారిలో నేపాల్‌కు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లు సమాచారం. కొండచరియలు విరిగి పడుతుండటంతో గురువారం ఉదయం నుంచి గంగోత్రి జాతీయ రహదారితోపాటు, నంద్‌ప్రయాగ్ ప్రాంతంలో బద్రినాథ్ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ దారి గుండా ప్రయాణికులను అనుమతిస్తామని తెలిపారు. అయితే, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వస్తున్న వరద సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు వెల్లడిరచారు.