నిద్రిస్తున్న ఓ మహిళపై నీళ్లు పోసిన కేసులో ముద్దాయికి గన్నవరం 12వ అదనపు న్యాయస్థానం గురువారం జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి శివారు పాలెంరోడ్డుకు చెందిన నున్న సామ్రాజ్యం.. స్థానిక రంగుల కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోంది.
గతేడాది సామ్రాజ్యం మరిది చనిపోగా, తోటికోడలికి తోడుగా వెళ్లింది. 20.4.2022వ తేదీ రాత్రి ఇంటి వరండాలో నిద్రిస్తోంది. అదేరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి ఆమెపై నీళ్లు పోశాడు. లేచిచూడగా.. నీళ్లు పోసిన వ్యక్తి నున్న శోభనాచలపతిరావుగా సామ్రాజ్యం గుర్తించింది. గతంలోనూ అతడు ఇలానే నిద్రిస్తున్న తనపై రెండు పర్యాయాలు నీళ్లు పోసి ఇబ్బందులకు గురిచేశాడని, శోభనాచలపతిరావుపై చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని సీఎమ్ఎస్ పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. అతడిపై నేరం రుజువవడంతో 18 నెలల జైలు, రూ.6వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పిటిషనర్ తరఫున ఏపీపీ ప్రసన్న వాదనలు వినిపించినట్లు పోలీసులు వెల్లడించారు.