ఆఫర్లో విమానం టిక్కెట్లు కేటాయిస్తామని ఓ వెబ్సైట్ నిర్వాహకులు ప్రకటన ఇచ్చారు. నిజమేనని నమ్మి టిక్కెట్ల కోసం సొమ్ము చెల్లించిన వారిని మోసగించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు శివారు వట్లూరుకు చెందిన సత్తెనపల్లి విజయ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి మలేసియా వెళ్లాలని అనుకున్నారు.
ఆన్లైన్లో టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆయన భార్య నవ్య గత నెల 30న ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్లు వెతికారు. ఓ వెబ్సైట్లో ఆఫర్లో ఉన్నట్లు కనిపించగా.. రూ.76,134 వెచ్చించి అయిదు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఆన్లైన్లో టిక్కెట్లు పంపించాల్సి ఉండగా ఆ సంస్థ ఆ విధంగా చేయలేదు. వీరు సంప్రదించినా నిర్వాహకులు అందుబాటులోకి రాలేదు.
మోసపోయామని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో త్రీటౌన్ సీఐ శివాజీ ఆధ్వర్యంలో ఎస్సై శంకర్ ఆ వెబ్సైట్ నిర్వాహకులపై గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.