` అక్రమార్కులకు అండగా ఏసీపీ
` ఫిర్యాదుదారులకు వేధింపులు
` నిజాలు నిగ్గుతేలాలంటే జీవీఎంసీ కమిషనర్
స్వయంగా తనిఖీ చేయాలి: స్థానికులు
విశాఖపట్నం, ఆగష్టు 02: అక్రమ నిర్మాణామని ఫిర్యాదులెన్ని వచ్చినా మేము మొద్దు నిద్ర నటిస్తాం. కమిషనర్ చూడకుండా ఆయన కళ్లకు గంతలు కట్టేస్తాం. ఇది జీవీఎంసీ జోన్`3లోని 9వ వార్డు ప్లానింగ్ విభాగం అధికారులు అక్రమార్కులకు ఇస్తున్న భరోసా. నిబంధనలకు నిలువునా పాతరేస్తున్నారు. నీళ్ల ట్యాంక్ పేరుతో అదనపు అంతస్తు నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు అలుపెరగని పోరాటం చేస్తున్నా కనీసం స్పందన కరవైంది. స్పందన, జగనన్నకు చెబుదాం ఇలా ఎన్ని గ్రీవెన్స్‌లకు ఫిర్యాదు చేసినా ఏసీపీ చేతిలో బుట్టదాఖలవుతున్నాయి. అక్రమార్కులకు అంతగా ఏసీపీ స్వయంగా వెనుకేసుకొస్తుండటంతో కిందస్థాయి సిబ్బంది అదే బాటలో వెళ్తున్నారు. మొత్తం మీద జీవీఎంసీ జోన్`3లో అక్రమ, అవినీతి అంతస్తులకు ప్రస్తుత అసిస్టెంట్ సిటీ ప్లానర్ వక్ర భాష్యంతో కొత్త బాటలు వేస్తున్నారు. అక్రమ అంతస్తుకు అవినీతి ఆజ్యం పోస్తున్నారు. దీంతో నీళ్ల ట్యాంక్ పేరుతో ప్లాన్‌లో లేని అక్రమ అంతస్తుకు అఘమేఘాలమీద రంగం సిద్దమైంది. భవన నిర్మాణం ప్రారంభం నుంచి ప్లాన్ ఉల్లంఘనలు, జీవీఎంసీ గిప్ట్ ఇచ్చిన రోడ్ అఫెక్టడ్ ఏరియా, సెట్‌బ్యాక్‌లలో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గత ఏసీపీ మూడు సార్లు ప్లాన్ ఉల్లంఘనలను గుర్తించి డిమాలిష్ చేశారు. ఇప్పుడూ అనుకూలుమైన ఏసీపీ రావడంతో నీళ్ల ట్యాంక్ పేరుతో అదనపు అంతస్తుకు తెర లేపారు. నిజానికి ప్లాన్‌లో వాటర్ ట్యాంక్‌ను చూపలేదు. దీంతో సింటక్స్ వంటి ఎత్తు తక్కువున్న మూవబుల్ వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చేసుకోవడం తప్పని సరి. అయితే దీనికి ఏసీపీ కొత్త వాదన తెరమీదకు తెచ్చి ఫిర్యాదు దారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచాల్సింది పోయి వారి వివరాలను అక్రమార్కులకు ఇచ్చి బెదిరింపులకు ఊతమిస్తున్నారు. వాటర్ ట్యాంక్ పేరుతో పూర్తి శ్లాబ్ ఏరియాకు పిల్లర్లు, గోడలు నిర్మించి శ్లాబ్ వేసేందుకు సిద్దమైన అక్రమ అంతస్తుపై స్థానికులు అలుపెరగని పోరాటం చేస్తుంటే వారిని బెదిరించడం ఇక్కడి ప్లానింగ్ సిబ్బందికి అలవాటై పోయింది. దీనికి ఏసీపీ అండదండలు ఎక్కువుగా ఉండటంతో ఫిర్యాదులు దారులు బెదిరిపోతున్నారు.
ఫిర్యాదులకు స్పందన లేదు…
స్పందన ఫిర్యాదులకు స్పందన లేకుండా కమిషనర్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. జగనన్నకు చెబుదాంలో సయితం స్పందన కరవైంది. ప్లాన్ ఉంది, నోటీసులిచ్చాం వంటి సమాధానాలు మినహా చర్యలు కానరావడం లేదు. దీంతో సిల్ట్GజిG2 అంతస్థులకు అనుమతిస్తే ఏకంగా నీళ్లట్యాంక్ పేరుతో పూర్తి శ్లాబ్ ఏరియాలో నిర్మాణం సాగుతున్నా పట్టించుకోవడం లేదు. నోటీసులిచ్చి ప్లాన్ అనుమతులు ఉల్లంఘించిన నిర్మాణాలను తొలగించాలి. అందుకు ఏసీపీ ఆదేశాలివ్వాలి. అయితే ఏసీపీ అటువంటి అదేశాలు ఇవ్వడం లేదని కిందిస్థాయి టీపీఎస్ వాపోతున్నారు. చట్టంలో పేర్కొన్న విధులు నిర్వర్తించని ఏసీపీపై దర్యాప్తు జరపాల్సిందిగా ఫిర్యాదుదారులు ఏసీబీ, విజిలెన్స్ వంటి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. ఒక వేళ నగర మున్సిపల్ కమిషనర్ అకస్మిక తనిఖీల్లో గుర్తించిన అక్రమ నిర్మాణాలను సయితం ఏసీపీ తెరచాటుకు నెడ్తున్నారన్న విమర్శలు వార్డులో విన్పిస్తున్నాయి. సచివాలయం ప్లానింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ ప్లానింగ్ విభాగం అధికారులు తప్పించుకోచూస్తుండటంతో ఇప్పుడు అకస్మిక తనిఖీలు అటకెక్కాయి. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఫిర్యాదు దారులు ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం కోల్పోతున్నారు. జగనన్నకు చెబుదాం అంటూ కొత్త ఫిర్యాదుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు జగనన్నకు చెబుదాం ఫిర్యాదులకు సయితం జోన్`3ప్లానింగ్ విభాగం అధికారులు వక్రభాష్యాలు చెబుతుండటం నీళ్ల ట్యాంక్ నిర్మాణం పేరుతో నిలువెత్తు అవినీతికి ఆజ్యం పోస్తుంది.
గతంలో మూడు సార్లు తొలగించారు.. మళ్లీ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు…
జీవీఎంసీ జోన్`3, 9వ వార్డు పరిధిలోని ఎంఎంటిసి కాలనీ రెవెన్యూ సర్వేనెంబర్ 12లో డోర్ నెంబర్ 55`12`10లో స్టిల్ట్(పార్కింగ్)జిG2 అంతస్థుల రెసిడెన్సియల్ భవన కోసం ముగ్గురు వ్యక్తులు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన టీపీఎస్ జి.బాలరాజు జీవో ఎంఎస్ ఎంబర్ 119 ఎంఏఅండ్యూడీ నిబంధనలకు లోబడి ఉందని ప్లాన్ అనుమతులు మంజూరు చేశారు. అయితే ప్లాన్ పొందిన యాజమానులు దాన్ని విభేదించి నిర్మాణాలు చేపట్టడమే కాకుండా అక్రమ అంతస్తు, సెట్‌బ్యాక్ డివేషన్, రోడ్ ఎఫెక్ట్డ్ ఏరియా అక్రమణ వంటి వాటిపై కాలనీ వాసులు ఫిర్యాదులు చేశారు. గతంలో మూడు సార్లు తొలగించారు. అయితే ఏసీపీ మారడంతో అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. పాత పొరపాట్లతో పాటు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అనధికారిక అంతస్తుకు శ్రీకారం చుట్టారు. దీనిపై చర్యలు తీసుకోవల్సిన ఏసీపీ, ప్లానింగ్ సిబ్బంది చెబుతున్న వక్రభాష్యం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. నీళ్ల ట్యాంక్ పేరుతో అదనపు అంతస్తుకు అక్రమంగా తెగబడ్తున్న వైనం ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తుంది. ప్లాన్‌లో చూపిన దానికి భిన్నంగా నిర్మాణం ఉంటే కూల్చివేస్తారు. నిబంధనలు ఇంత కచ్చితంగా ఉంటే ప్లాన్‌లో చూపని వాటర్ ట్యాంక్ పేరుతో ఒక అక్రమ అంతస్తుకు ఏసీపీ ఎలా అనుమతిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏసీపీ చర్యలను ఇప్పుడు ఫిర్యాదు దారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తును కోరుతున్నారు. ఆరు యూనిట్ల భవనానికి అంత పెద్ద వాటర్ ట్యాంక్‌ను ఎలా అనుమతిస్తారు ? అంతకు మించి కాలమ్స్‌పై ట్యాంక్ నిర్మిస్తే కింద ఖాళీగా విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ మొత్తం గోడలు నిర్మించి వాటర్ ట్యాంక్ కట్టేస్తుంటే ఏసీపీ ఏమీ చేస్తున్నట్టు. ఈ కథవెనుకున్న నిజాలు నిగ్గుతేలాలంటే జీవీఎంసీ కమిషనర్ స్వయంగా తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే నగరంలో అన్ని ప్రాంతాల్లో భారీ వాటర్ ట్యాంక్‌లు పేరుతో భవనాలపై అక్రమ అంతస్తులు వెలుస్తాయి.