నూహ్ అల్లర్లు.. నిందితుల ఇళ్లు కూల్చివేత
. ఆధారాలు సేకరించి చర్యలు చేపట్టిన అధికారులు
. నాలుగేళ్ల నుంచి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి తిష్ట
చండీఘడ్, న్యూస్‌లీడర్, ఆగస్టు 4 : హరియాణాలోని నూప్ జిల్లాలో జరిగిన అల్లర్లపై ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆ ప్రాంతంలో అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించిన లాఎన్ఫోర్స్మెంట్ అధికారులు నూప్‌ా జిల్లాలోని తావుడులో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించారు. వీరంతా అక్రమంగా వచ్చి అల్లర్లకు పాల్పడుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ అల్లర్లకు పాల్పడిన వారు బంగ్లాదేశ్ నుంచి గత నాలుగేళ్లలో వలస వచ్చిన వారేనని, ఇక్కడ స్థలాలను కబ్జా చేసి పూరి గుడిసెలు నిర్మించుకొని ఉంటున్నారని హరియాణా పట్టణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున పోలీసు మోహరించి శుక్రవారం పూర్తి గుడిసెలను తొలగించారు. వీరంతా ముఖ్యంగా రాళ్లదాడులు, దుకాణాల లూటీలకు పాల్పడడమే ప్రధానంగా అల్లర్లకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సేకరించి, నిందితులను గుర్తించిన తరువాతే ఈ చర్యలు చేపట్టనట్టు తెలిపారు. వీరు దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను పోలీసులు విడుదల చేశారు. ఇదే విధమైన ఆపరేషన్‌ను నల్హార్ గ్రామంలో కూడా పోలీసులు చేపట్టారు. ఈ గ్రామంలో భారీ సంఖ్యలో వాహనాలను అల్లరి మూకలు దహనం చేశారు. నూప్‌ా అల్లర్ల వెనకు ఉన్న సుమారు 50 మంది కుట్రదారులను పోలీసులు గుర్తించారు.
ఎస్పీ బదిలీ..
ఓ వర్గం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన సమయంలో సెలవులో ఉన్న నూప్‌ా జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అతడిని భివాని ప్రాంతానికి బదిలీ చేసింది. అతడి స్థానంలో ఏడీజీపీ వద్ద ఓఎస్డీగా పని చేస్తున్న నరేంద్ర బిజ్రానియాను నూప్‌ా ఎస్పీగా నియమించింది. నూప్‌ాలో యాత్ర సమయంలో వరుణ్ సెలువులో ఉండగా.. పాల్వాల్ ఎస్పీ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. యాత్ర సమయంలో ఇక్కడ జరిగిన దాడులు.. ఆ తర్వాత మత విద్వేషాలుగా మారి ఇతర ప్రాంతాలకు కూడా పాకిన విషయం తెలిసిందే.
ఆరావళీ పర్వతాల్లో నక్కి..
నూప్ అల్లర్లలో పాల్గొన్న వారిలో చాలా మంది విధ్వంసకారులు సమీపంలోని ఆరావళీ పర్వతాల్లో నక్కినట్లు ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టుల పర్వానికి తెర తీయడంతో తప్పించుకోవడానికి ఈ పర్వతాలపై ఉన్న చిన్న చిన్న గ్రామాల్లోకి వారు చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ అల్లర్లకు సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్టు చేసిన వారిపై కూడా కేసులు పెట్టారు.