విశాఖలో మరో సంచలనం
ప్రియుడితో కలిసి విషమిచ్చి చంపిన కానిస్టేబుల్ భార్య
అనుమానాస్పద మృతిని ఛేదించిన పోలీసులు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 3: అనుమానాస్పదంగా మృతి చెందిన విశాఖ వన్ టౌన్ కానిస్టేబుల్ కేసును హత్య కేసుగా పోలీసులు గురువారం నిర్ధారించారు. అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తున్న రమేష్ (35, కంప్యూటర్ విభాగం, 2009 బ్యాచ్, పీసీ నంబర్ 1286)బుధవారం తన ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. మంగళవారం ఆయన విధులకు హాజరయ్యారు. రాత్రి నిద్రించగా, తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. అయితే భార్య తీరుపై కాస్త అనుమానం రాగా ఎంవీపీ పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలెట్టారు. కానిస్టేబుల్ రమేష్ ఇంటి సమీపంలో ఉన్న ఓ కారు డ్రైవర్‌తో..కానిస్టేబుల్ భార్య కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. నిత్యం కానిస్టేబుల్ ఇంటిముందే కారును నిలిపి ఉంచేవాడు ఆ డ్రైవర్. దీంతో వారిద్దరి మధ్య నడుస్తున్న వివాహేతర సంబంధాన్ని కానిస్టేబుల్ ప్రశ్నిస్తూ వచ్చాడు. దీంతో ప్రియుడితో కలిసి కానిస్టేబుల్‌కు విషమిచ్చి ఆపై మంచంపై నిద్రిస్తున్న కానిస్టేబుల్ తలపై తలగడతో మోది హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక0గా నిర్ధారించారు. అయితే హత్య కాబడిరది కానిస్టేబుల్ కావడం, వివేహతర సంబంధంతో ముడి పడి ఉండడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నారు. శివాజీపాలెంలో ఉంటున్న కానిస్టేబుల్ కు భార్య, ఇద్దరు ఆడపిల్లలూ ఉన్నారు. ఇటీవల స్థానికులు కూడా కానిస్టేబుల్ ను ఇల్లు ఖాళీ చేసేయమని ఒత్తిడి చేసినట్టు సమాచారం. కేవలం వీరి న్యూసెన్స్ తట్టుకోలేకే వారంతా ఇలా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించగా ఆ నివేదికలో కూడా పలు కీలక విషయాలు వెల్లడైనట్టు తెల్సింది. రమేష్ గతంలో భీమిలి శాంతిభద్రతల పోలీస్ స్టేషన్ లో పని చేసి మూడేళ్ల క్రితమే వన్ టౌన్‌కు వచ్చారు. ఎలాంటి అలవాట్లూ లేని, ఆరోగ్యంగా ఉండే మనిషి, అన్ని జాగ్రత్తలూ తీసుకునే వ్యక్తి అలా విగతజీవిగా మారడంపైనే తమకు అనుమానాలున్నాయని పోలీసులు తొలుత తేల్చడంతో ఈ వ్యవహారం బయటపడిరది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.