చెడు అలవాట్లకు బానిసై కట్టుకున్నోడినే ఖతం చేసింది. అన్నను మట్టుపెట్టిందనే కక్షతో ఆమెను మరిది ఇటీవల హతమార్చాడు. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన రేణుక (24) దారుణ హత్య వెనుక మిస్టరీ వీడింది. కుత్బుల్లాపూర్ మండలం సూరారం విశ్వకర్మకాలనీకి చెందిన సురేశ్, రేణుక అలియాస్ ధరణి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
సురేష్ ఆటోడ్రైవర్. వీరికిద్దరు కుమార్తెలు. రేణుక నిత్యం కల్లు దుకాణాలకు వెళ్లేది. అలా దుండిగల్ తండాకు చెందిన అనాథ బాలిక పరిచయమవడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. కొంతకాలానికి భర్తకు, ఆ బాలికకు రహస్యంగా పెళ్లి చేసింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఫిబ్రవరి 5న భర్త మద్యం మత్తులో నిద్రపోతుండగా ఆ బాలికతో కలిసి చంపేసింది. భర్తను ఎవరో చంపారని నమ్మించినా చివరకు హంతకురాలు ఆమేనని తేలడంతో జైలుకెళ్లింది.
రేణుక బెయిలుపై బయటకొచ్చిన విషయం తెలుసుకున్న మరిది నరేశ్ (26) ఆమెకు మంగళవారం రాత్రి ఫోన్ చేసి తనకు రూ.200 కావాలని అడిగాడు. ఎందుకని అడిగితే మద్యం కోసమని చెప్పడంతో తానూ తాగుతానంటూ నరేశ్ ఇంటికెళ్లింది. అప్పటికే అక్కడ సాయి(19), పద్మ(30), మరో బాలుడు(17) ఉన్నారు. నలుగురూ మద్యం తాగారు. రేణుక మత్తులో ఉండగా నలుగురూ కలిసి మెడకు చున్నీ బిగించి చంపేశారు. ఆమె ఫోన్ కాల్స్ పరిశీలించగా చివరిలో నరేశ్ నంబరుంది.