కుటుంబ కలహాలతో ఘర్షణ పడి భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంలో.. తన వద్ద ఉన్న ఇద్దరు కుమారులకు విషం తినిపించి, తనూ తిని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఆ తండ్రి. చిన్న కొడుకు రాజ్‌కుమార్ (3) మృతి చెందగా అయిదేళ్ల వయసున్న పెద్ద కొడుకు విఘ్నేష్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమనగల్ శివారు బలరాంతండాకు చెందిన పెద్దపులి రమేష్ బుధవారం భార్య శాంతితో గొడవపడ్డాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
గురువారం బయటకు వెళ్లి వచ్చిన రమేష్ రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. బత్తాయి తొనల్లో ఎలుకల మందు కలిపి ఇద్దరు కుమారులకు తినిపించాడు. తాను కూడా వాటిని తిన్నాడు. బత్తాయిల నుంచి వాసన రావడంతో విఘ్నేష్ సమీపంలో ఉన్న నానమ్మ దస్లీకి విషయాన్ని చెప్పాడు. ఆమె భోరున విలపిస్తూ పెద్దకుమారుడు శ్రీనుతో పాటు తండాకు చెందిన హథిరాంకు విషయాన్ని వివరించింది. అప్పటికే తన కళ్లు తిరుగుతున్నాయంటూ విఘ్నేష్ చెప్పడంతో ఇద్దరు చిన్నారులను ద్విచక్రవాహనంపై జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజ్‌కుమార్ మృతి చెందాడు.
రమేష్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. విఘ్నేష్ తనవద్ద ఉన్న రెండు బత్తాయి ముక్కలను పక్కింటి బాలికకు ఇవ్వగా.. వాటిని తిన్న ఆమె కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. విఘ్నేష్ ఆరోగ్య పరిస్థితి ఏమీ చెప్పలేమని వైద్యుడు మధుసూదన్‌రావు తెలిపారు. మహబూబాబాద్ రూరల్, పట్టణ పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఈ ఘటనపై విచారించారు.