` యూపీలోని మీరట్ జిల్లా వైద్య కళాశాలలో ఘోరం ` ప్రసవం కోసం చేరిన మహిళల్లో హెచ్ఐవీ నిర్ధారణ ` కారణాలను గుర్తించేందుకు కమిటీ నియామకం
లక్నో, న్యూస్లీడర్, ఆగస్టు 5 : ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హెచ్ఐవీ సోకిన గర్భిణుల కేసులు పెద్ద మొత్తంలో వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 16 నెలల కాలంలో 60కి పైగా గర్భిణులకు హెచ్ఐవీ ఉన్నట్టు ఇక్కడ గుర్తించారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అసలేం జరుగుతోందన్న దానిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
లాలాలజపత్రాయ్ మెడికల్ కళాశాలలో ప్రసవం కోసం చేరిన (డెలివరీ) గర్భిణులకు సాధారణంగా రక్త నమూనాలను సేకరిస్తుంటారు. ఈ పరీక్షల్లో హెచ్ఐవీ ఉన్నట్టు బయటపడుతోంది. ఇక్కడి ఏఆర్టీ సెంటర్లో 2022-23 సంవత్సరంలో 33 కొత్త హెచ్ఐవీ కేసులు (గర్భిణులకు) వెలుగు చూశాయి. ఈ ఏడాది జూలై వరకు 13 కొత్త కేసులు వచ్చాయి. అంతకుముందు 35 మంది దీని బారిన పడినట్టు గుర్తించారు.
ఈ గర్భిణులు ప్రసవించిన శిశువులకు 18 నెలలు నిండిన తర్వాతే హెచ్ఐవీ పరీక్షిస్తామని అక్కడి వైద్యులు తెలిపారు. కాకపోతే హెచ్ఐవీ సోకిన గర్భిణులు, వారు ప్రసవించిన చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. అసలు వారు హెచ్ఐవీ బారిన ఎలా పడుతున్నారో కారణాలను గుర్తించేందుకు ఓ బృందాన్ని నియమించారు. హెచ్ఐవీ అనేది రక్త మార్పిడి లేదా లైంగిక కార్యకలాపాల ద్వారానే వస్తుంటుంది. ఇక్కడ హెచ్ఐవీ నిర్ధారణ అవుతున్న రోగులకు ఏ కారణాల వల్ల వ్యాధి సోకుతుందోననే విషయమై ఆరా తీస్తున్నారు.