. టీడీపీ నేతల ఆగ్రహం
. బెదిరింపులకు భయపడం: అచ్చెన్నాయుడు
అమరావతి, న్యూస్ లీడర్, ఆగస్టు 5: పుంగనూరు, తంబళ్లపల్లి ఘటనలపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం కలిసింది. గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, అశోక్ బాబు ఉన్నారు. శుక్రవారం నాటి దాడుల వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను గవర్నర్‌కు అందజేశారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం…
మరోవైపు, పుంగనూరు ఘటనపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండిరచారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, హత్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పల్నాడులోనూ తెదేపా సానుభూతిపరుడు కోటయ్యపై వైకాపా నేత కృష్ణమూర్తి దాడి చేశాడని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కోటయ్యపై వైకాపా గూండాలు రెండోసారి దాడికి తెగబడ్డారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా వైకాపా నేతలకు కాపుగాస్తున్నారని విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడమని, అరాచకాలపై పోరాటం కొనసాగిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డి అరాచకం రాష్ట్రమంతా చూసింది: టీడీపీ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం రాష్ట్రమంతా చూసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పులివెందుల పర్యటన విజయవంతం కావడంతో వైకాపా నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఉందన్న నేతలు.. అందుకే పుంగనూరులో అల్లర్లు ప్రేరేపించారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా ఎవరి జాగీరు కాదని, పుంగనూరు బైపాస్ నుంచి చంద్రబాబు వెళ్తుంటే దాడి చేయించాలని పెద్దిరెడ్డి కుట్ర పన్నారంటూ నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగుదేశం శ్రేణుల్ని పోలీసులే అనవసరంగా రెచ్చగొట్టారన్నారు.