ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసి.. అనంతరం గుండెపోటుగా చిత్రీకరించింది ఆ భార్య. మద్యం తాగించి నిద్రపోతుండగా దిండుతో ఊపిరాడకుండా చేసింది. ఆర్థిక ప్రయోజనాల కోసం సుపారీ ఇచ్చి మరీ మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ వెల్లడించారు.
వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్‌కుమార్ (40) భార్య శివజ్యోతి అలియాస్ శివానితో కలిసి ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందాడంటూ భార్య ఎంవీపీ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం కలగడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాము అన్యోన్యంగానే ఉంటున్నామని ఆమె కొన్ని వీడియోలు చూపించగా.. అనుమానం మరింత బలపడటంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడక మృతి చెందినట్లు తేలింది. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో వాస్తవాలు వెల్లడయ్యాయి.
రమేష్ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివజ్యోతి ఓ పథకం పన్నింది. ఆమె తన వద్దనున్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. అప్పుఘర్‌కు చెందిన వెల్డింగ్ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చారు. ఒకటో తేదీ రాత్రి రమేష్ ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయారు. అనంతరం నీలాను పిలిచారు. రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా అదిమిపట్టుకోగా, కదలకుండా శివజ్యోతి కాళ్లు పట్టుకొని ప్రాణాలు తీశారు. రామారావు ఇంటి బయట ఎవరూ రాకుండా చూశాడు.
ఎదురింట్లో ఉంటున్న రామారావు.. శివజ్యోతి ఇంటి పక్కనే నిత్యం కారు పార్కింగ్ చేసేవాడు. ఏడాదిన్నరగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం గమనించిన రమేష్.. ఓసారి రామారావుతో గొడవ పడ్డాడు. అనంతరం రామారావు, శివజ్యోతి కొన్ని రోజులు బయటకు వెళ్లిపోయారు. ఇరు వర్గాల కుటుంబీకులు రమేష్‌కు నచ్చజెప్పి శివజ్యోతిని ఇంటికి తీసుకొచ్చారు. అయినా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు ఆగలేదు. దీంతో రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని శివజ్యోతిని రమేష్ మండిపడేవాడు. పిల్లలను తీసుకొని వెళ్తానని వాదించడంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి.
భర్తను హత్య చేసి సాధారణ మృతిగా చిత్రీకరించి ఉద్యోగం ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు పొందాలని చూసింది. డబ్బుతో పాటు ఉద్యోగం కూడా వస్తుందని భావించింది. అనంతరం రామారావుతో కలిసి ఉండాలనుకుంది.