అద్దెకు వస్తానంటూ యజమానిని నమ్మించి తాను సూచించినట్లు డబ్బు కడితే రెట్టింపు తిరిగి వస్తుందంటూ ఉచ్చులోకి దింపి రూ.1.98 లక్షలు దోచేసిన ఘటన పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది. పటాన్చెరు సింఫనీ పార్కుహోమ్స్కు చెందిన రవితేజ నోబ్రోకర్ యాప్‌లో ఇల్లు అద్దెకు ఉందని పెట్టాడు. ఇది గమనించిన సైబర్ నేరస్థుడు జులై 18న ఫోన్లో రవితేజను పరిచయం చేసుకున్నాడు.
మిలటరీలో పనిచేస్తున్నానని, తర్వాతి రోజు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి చేరతానని చెప్పాడు. మరుసటిరోజు ఫోన్‌చేసి తనకు సంబంధించి ఆధార్, పాన్ ఫొటోలను తన వాట్సాప్ నంబరు నుంచి పంపాడు. అనంతరం తాను చెప్పినట్లుగా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ నమ్మించి రవితేజ హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి రూ.5 పంపించమని చెప్పి, తిరిగి అతని ఖాతాకు రూ.10 చెల్లించాడు. ఆపై నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.39వేలు చెప్పిన వ్యక్తి అకౌంట్లో జమ చేయించాడు. ఇలా దఫదఫాలుగా రూ.1.98 లక్షలు వేయించుకున్నాడు. ఇంకా పంపాలని కోరగా మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.