. కారు కొన్న సంతోషంలో దోస్తులకు పార్టీ
. ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం
. అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు
. ఓనర్ సహా మరో ముగ్గురు యువకులు మృతి
అనంతపురం, న్యూస్లీడర్, ఆగస్టు 5: అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. కారు కొన్న సంతోషంలో స్నేహితులకు శుక్రవారం రాత్రి పార్టీ ఇచ్చాడు. అదే కారులో ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి శుక్రవారం సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం తిరిగి వస్తుండగా తాడిపత్రి హైవేపై రావి వెంకటపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న మోహన్ రెడ్డి ్డ(27)తోపాటు ఆయన స్నేహితులు విష్ణు చౌదరి (24), నరేశ్ రెడ్డి (28), మధుసాగర్ రెడ్డి (28) అక్కడికక్కడే చనిపోయారు. మరో యువకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడిరచారు.