దాంపత్య జీవితంలో భర్తకు సహకారం అందిస్తూ… కుటుంబానికి తన వంతు పాత్ర పోషించాల్సిన భార్యే భర్తను ప్రియుడి సహకారంతో హతమార్చిన ఘటన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. చేబ్రోలు పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం మేరకు…తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన కురిపాటి చంద్రశేఖర్ (39) అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నిత్యశ్రీ, సిద్ధార్థ .. ఇద్దరు సంతానం. చంద్రశేఖర్ కొన్నేళ్లుగా నారాయణపురంలోని టైల్స్ పరిశ్రమలో సూపర్వైజర్గా పని చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున తన పడక గదిలో చంద్రశేఖర్ గొంతు మీద తీవ్ర గాయాలై రక్తపు మడుగులో విగతజీవిగా ఉండటాన్ని గమనించిన అతడి పిల్లలు ఇంటి యజమాని నెక్కల శేఖరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు చెప్పడంతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు, నిడమర్రు సీఐ మోగంటి వెంకట సుభాశ్, చేబ్రోలు ఎస్సై కె.స్వామి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏలూరు నుంచి క్లూస్ టీం, పోలీసు జాగిలాన్ని రప్పించారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
చంద్రశేఖర్ భార్య భువనేశ్వరి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో ఆమెను పోలీస్‌స్టేషన్‌కి విచారించారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన యువకుడితో ఆమె సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలింది. అతడి సాయంతో భర్తను హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు చెప్పారు. సీఐ వెంకట సుభాశ్ మాట్లాడుతూ మృతుడి గొంతు మీద పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచిన గాయాలను గుర్తించామన్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విగతజీవిగా తండ్రి పడి ఉండటం.. తల్లిని పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న వీరి పిల్లల అమాయక చూపులు స్థానికులను కలచివేశాయి.