` అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి కాల్పులకు తెగబడిన దుండగులు
` ముగ్గురు మృతి
` భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పులు
` బిష్ణుపూర్‌లో తీవ్ర అలజడి
ఇంఫాల్, న్యూస్‌లీడర్, ఆగస్టు 5 : జాతుల మధ్య వైరం కారణంగా చెలరేగిన హింస మణిపూర్‌ను వణికిస్తున్నది. హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. ఒకవైపు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలని పట్టుపట్టడం, అధికార పక్షం అందుకు బెట్టుచేయడంతో పార్లమెంటులోని ఉభయ సభలు స్తంభించిపోతున్నాయి. ఈ తరుణంలో తాజాగా.. తాజాగా ఈ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ హింస చెలరేగింది. మృతిచెందిన వారు క్వాక్టా ప్రాంతంలోని మైతేయి వర్గానికి చెందిన వారుగా తెలుస్తోంది.
రాష్ట్రంలోని గత మూడు నెలల నుంచి హింసాత్మక వాతావరణ నెలకొన్న నేపథ్యంలో వీరు శుక్రవారం అర్ధరాత్రి తమ ఇళ్లకు కాపాలా కాస్తుండగా గుర్తుతెలియని దుండగులు వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తండ్రీకుమారుడితో పాటు మరో వ్యక్తి మరణించారు. నిందితులు మిలిటెంట్లు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేంద్ర భద్రతా దళాల బఫర్‌జోన్‌ను దాటుకుని దుండగులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటన నేపథ్యంలో క్వాక్టాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఘటన జరిగిన కొద్ది సేపటికే ఈ ప్రాంతంలో కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో భీకర కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బిష్ణుపూర్‌లో తీవ్ర అలజడి
క్వాక్టా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ కాల్పుల్లో మణపూర్ కమాండో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. అటు పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. ప్రస్తుతం బిష్ణుపుర్‌లో పరిస్థితులు అలజడిగా ఉన్నాయని అధికారిక వర్గాలు వెల్లడిరచాయి.
ఇదే బిష్ణుపుర్‌లో గురువారం రాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయి ఆయుధాలను లూటీ చేశాయి. నారన్సీనా ప్రాంతంలో రెండో భారత రిజర్వు బెటాలియన్ (ఐఆర్బీ) ప్రధాన కార్యాలయంలోని పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీగా ఆయుధ సామగ్రిని ఎత్తుకెళ్లారు. అంతకుముందు రెండు రోజుల క్రితం భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని 17 మంది గాయపడ్డారు.