` మణిపూర్ అంశంపై నిరసనలు ` సభ్యుల తీరుపై లోక్సభ స్పీకర్ ఆగ్రహం ` రాహుల్ సభ్యత్వం పునరుద్ధరణ
ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 7 : మణిపూర్ అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. ఏ చర్చా జరగడం లేదు. అధికార పక్షం చర్చకు అనుమతించడం లేదు. ప్రతిపక్షాలు రాజీ పడడం లేదు. సమావేశాలు మొదలైన నాటి నుంచి ఇదే తంతు. సోమవారం కూడా ఉభయ సభల్లోనూ విపక్షాలు ప్రధాని మోడీ మాట్లాడాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో గందరగోళం నెలకొంది. లోక్సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడగా.. రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలిచిపోయాయి. రెండు సభలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి.
లోక్సభలో నెలకొన్న పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా ఒకింత అసంతృప్తికి గురయ్యారు. ప్రశ్నోత్తరాల గంటలో పాలుపంచుకోవాలని ఉందా..?లేదా? అంటూ సభ్యులను ప్రశ్నించారు. సభ ఉన్నది గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి కాదన్నారు. కేవలం నినాదాలు చేయడం, ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరించడానికి వస్తున్నట్టు ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
రాహుల్ సభ్యత్వం పునరుద్ధరణ
రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరణపై కాంగ్రెస్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. మరోపక్క దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. ఈ విషయంలో సోమవారం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మేం న్యాయపరమైన ప్రక్రియను అనుసరించాం. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే మేం సభ్యత్వాన్ని పునరుద్ధరించాం అని తెలిపారు.