కొమరాడ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పాలెం పంచాయతీ రావికోనకు చెందిన కిల్లక సోములు, ధోరమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు జరగ్గా మూడో కుమార్తె స్వాతి(18) పార్వతీపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
వసతి గృహంలో స్నేహితులతో కలిసి ఉంటోంది. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. ఏమైందో తెలియదు కానీ శనివారం పురుగు మందు తాగింది. తల్లిదండ్రులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందింది. ఏ కష్టమొచ్చిందో తెలియదని, చెప్పకుండానే ప్రాణాలు తీసుకుందని తల్లిదండ్రులు బోరున విలపించారు.
అనంతరం కొమరాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జగదీశ్నాయుడు సిబ్బందితో ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఎస్సై చెప్పారు.