గోపాలపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 7 : రోడ్డు ప్రమాదంలో ఒక అధ్యాపకుడు మృతిచెందిన సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని శ్రీగౌరీ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పని చేస్తున్న రాజశేఖర్ (40) సుజాతనగర్ నుంచి ఊర్వశి జంక్షన్‌కు ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నాడు. ఇంతలో ఆర్ఆర్ వెంకటాపురం అల్వార్ దాస్ స్కూల్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వాహనం వచ్చి ఆయన ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందారు. రాజశేఖర్ స్వస్థలం పెదబయలు. ప్రమాదం గూర్చి సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ అశోక్ తక్షణమే ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నించారు. రాజశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడ్ని ఢీకొన్నది ఏ వాహనం అనేది సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తామని పెందుర్తి ఎస్ఐ అసిరితాత ఓ ప్రకటనలో తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టామన్నారు.